రివ్యూ : వకీల్ సాబ్

707
Vakeel Saab movie review

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్లకు పైగా విరామం తర్వాత పునరాగమనం చేస్తూ నటించిన చిత్రం ‘వకీల్ సాబ్’. హిందీ మూవీ ‘పింక్’కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించాడు. దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ‘వకీల్ సాబ్’ ఈ రోజే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ అంచనాల్ని సినిమా ఏ మేరకు అందుకుందో చూద్దాం..

కథ:
జనం కోసం ఏదో ఒకటి చేయాలని తపించే మనిషి సత్యదేవ్ (పవన్ కళ్యాణ్). అందుకే న్యాయవాది అవుతాడు. అదే సమయంలో శృతి హాసన్ ఆయన జీవితంలోకి వస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని కారణాలతో న్యాయవాద వృత్తికి దూరంగా ఉంటారు. హైదరాబాద్ లో ఒక కాలనీలో ఉంటాడు అదే సమయంలో ముగ్గురు అమ్మాయిలు అంజలి(జరీనా), అనన్య(దివ్య), నివేద (పల్లవి) ఒక కేసులో ఇరుక్కుంటారు. అందులో నివేదా థామస్ ను జైల్లో పెడతారు. ఎంపీ కొడుకు కేసు కావడంతో ఆమెకు బెయిల్ రాకుండా చేస్తారు. అలాంటి సమయంలో సత్యదేవ్ వాళ్ళకు సాయం చేస్తాడు. అది నచ్చని ఎంపీ అతడిని భయపెట్టాలని చూస్తాడు. దాంతో ఆ కేసును తానే టేకప్ చేస్తాడు సత్యదేవ్. కోర్టులో డిఫెన్స్ లాయర్ నందగోపాల్ (ప్రకాష్ రాజ్) ఎంపీ కొడుకు కేసు వాదిస్తుంటాడు. ఈ కేసులో చివరికి ఏమైంది అనేది అసలు కథ..

ప్లస్ పాయింట్స్‌:
పవన్ కళ్యాణ్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఆయన స్క్రీన్ పై కనిపిస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. వకీల్ సాబ్ సినిమాలో కూడా ఇదే చేసాడు. ఆయన సత్యదేవ్ పాత్రకు ప్రాణం పోసాడు. ముఖ్యంగా సెకండాఫ్లో వాదన ప్రతిపాదనలతో కోర్టు సీక్వెన్స్ దద్దరిల్లిపోయింది. ఆలోచింపజేసే డైలాగులతో పాటు యాక్షన్ సన్నివేశాలతోనూ అదరగొట్టాడు. ముగ్గురు అమ్మాయిల్లో నివేదా థామస్ చాలా బాగా నటించింది. అంజలి, అనన్య కూడా పర్లేదు. ప్రకాశ్ రాజ్ పాత్ర చాలా బాగుంది. నందగా ఆయన అదరగొట్టాడు.

మైనస్ పాయింట్స్‌:
ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా సాగుతుంది. దానికి తోడు కథ కూడా తెలిసింది కావడంతో అంత వేగంగా అనిపించదు. పవన్ కళ్యాణ్ కనిపించిన ప్రతిసారి అదిరిపోతుంది. సినిమా మొదలైన 15 నిమిషాలకు పవన్ వస్తాడు. తాగుబోతు లాయర్ గా.. అన్యాయం జరిగితే ఎదురుతిరిగే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ డిజైన్ చేశాడు దర్శకుడు వేణు శ్రీరామ్. కాకపోతే ఆయన ఎందుకు అలా మారాల్సి వచ్చింది అనే దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. అది పెద్దగా ఆసక్తికరంగా అనిపించదు. ఇంటర్వెల్ ముందు వరకు కూడా సినిమా కాస్త నెమ్మదిగా సాగుతుంది.

సాంకేతిక విభాగం:
ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ థమన్ సంగీతం. ఆయన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాను నిలబెట్టింది. పాటలు కూడా బాగున్నాయి. మరోవైపు నవీన్ నూలి ఎడిటింగ్ కాస్త వీక్. ఫస్టాఫ్ చాలా వరకు సన్నివేశాలు బోర్ కొట్టించాయి. సెకండాఫ్ మాత్రం అదిరిపోయింది. ముఖ్యంగా పవన్ సీన్స్ అన్నీ చాలా బాగున్నాయి. కోర్టు డ్రామా నెవర్ బిఫోర్ అన్నట్లు తెరకెక్కించాడు వేణు శ్రీరామ్. దర్శకుడు వేణు కూడా చాలా బాగా టేకప్ చేసాడు ఈ సినిమాను. ముఖ్యంగా ఆల్రెడీ ప్రూవ్ అయిన సబ్జెక్టును పవన్ లాంటి హీరో ఇమేజ్‌కు తగ్గట్లు మార్పులు చేయాలంటే కష్టం. కానీ దాన్ని చాలా సింపుల్‌గా చేసాడు దర్శకుడు వేణు శ్రీరామ్.

తీర్పు:
వకీల్ సాబ్.. పవర్ ప్యాక్డ్ మెసేజ్ ఓరియెంటెడ్.. ఆలోచింపచేసే మాటలతో వకీల్ సాబ్ అందర్నీ ఆకట్టుకుంటాడు. అమ్మాయిలకు విలువ ఇవ్వాలి.. వాళ్ళ భావాలను కూడా పట్టించుకోవాలి.. దాడులు జరిగినపుడే హడావిడి చేసేకంటే కూడా అమ్మాయిలకు భద్రత అనేది ఉండాలి అనేది ఈ సినిమాలో చూపించారు. ఓవరాల్ గా ఫస్టాఫ్ యావరేజ్ గా ఉన్న సెకండాఫ్ ఆలోచింప చేశాడు వకీల్ సాబ్.

విడుదల తేదీ:09/04/2021
రేటింగ్: 3/5
నటీనటులు : పవన్ కళ్యాణ్, శృతిహాసన్, నివేద థామస్, అంజలి, అనన్య, ప్రకాష్ రాజ్ తదితరులు..
సంగీతం : తమన్‌
నిర్మాతలు : రాజు, శిరీష్
దర్శకత్వం : శ్రీరామ్ వేణు