రాష్ట్రంలో మరోసారి ఉప ఎన్నికల వేడి రాజుకుంది. ఉత్తమ్ కుమార్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూర్‌నగర్ అసెంబ్లీ స్ధానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ తరపున పద్మావతి బరిలో ఉంటారని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే తెలపగా తాజాగా ఏఐసీసీ అమోదముద్ర వేసింది. ఉత్తమ్ పద్మావతి అభ్యర్ధిత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
2018 డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కోదాడ నుంచి ఉత్తమ్ పద్మావతి, హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేశారు. అయితే, కోదాడలో పద్మావతి ఓడిపోయారు.
ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ ఎంపీగా పోటీ చేశారు. ఆయన ఎంపీగా విజయం సాధించడంతో హుజూర్ నగర్ ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఉఎ ఎన్నిక అనివార్యం కాగా గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున బరిలో ఉన్న శానంపూడి సైదిరెడ్డితో పోటీపడనున్నారు ఉత్తమ్ పద్మావతి.