ఇరాన్‌తో యుద్ధానికి ముగింపు పలికేందుకు చర్చలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు ఇస్తున్న వేళ.. అమెరికా రహస్యంగా ఇరాన్‌పై మరోసారి దాడులకు పాల్పడినట్లు వార్తలు వెలువడ్డాయి. హోర్ముజ్ జలసంధిలోని అతిపెద్ద ద్వీపమైన ఖేష్మ్ ఐలాండ్‌పై అమెరికా పరిమిత స్థాయిలో దాడులు చేసినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. గత కొన్ని వారాలుగా ఇరాన్‌పై అమెరికా రహస్యంగా నిర్వహిస్తున్న దాడుల్లో ఇది తాజాదని పేర్కొంది.
ఇరాన్‌కు చెందిన అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ కథనం ప్రకారం.. ఖేష్మ్ ద్వీపంలో వరుసగా ఐదు పేలుళ్లు వినిపించాయి. ఆకాశంలో రెండు విమానాలు ఎగురుతూ కనిపించాయని స్థానికులు వెల్లడించారు. అమెరికా తన దాడులను పరిమిత స్థాయిలోనే కొనసాగించిందని, ఇరాన్‌పై పూర్తిస్థాయి సైనిక చర్యను తిరిగి ప్రారంభించే ఉద్దేశం లేదనే సంకేతాలు ఇచ్చేందుకు వాటిని రహస్యంగా ఉంచిందని తెలిపింది. అమెరికా ఆస్తులపై ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులతో దాడులకు పాల్పడుతున్న ఇరాన్ సైనికులను లక్ష్యంగా చేసుకున్నట్లు ఓ అమెరికా అధికారి వెల్లడించారు.
అయితే ఈ దాడులు పూర్తిస్థాయి యుద్ధాన్ని తిరిగి ప్రారంభించే చర్యలుగా కనిపించడం లేదని కథనం పేర్కొంది. అమెరికా మధ్యంతర ఎన్నికలకు ముందు ఈ పరిణామాలు చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికలకు ముందు ఇరాన్‌పై దాడులు చేయబోమని గతంలో ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే.
మరోవైపు ఇరాన్‌తో ఒప్పందం కుదిరే అవకాశాలు మెరుగుపడుతున్నాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం వాషింగ్టన్‌లోని లింకన్ మెమోరియల్ రిఫ్లెక్టింగ్ పూల్ వద్ద మాట్లాడుతూ.. చర్చలు సానుకూల దిశలో సాగుతున్నాయని తెలిపారు. ఒప్పందం దిశగా పరిణామాలు బాగానే ముందుకు సాగుతున్నాయని, అందుకే చమురు ధరలు తగ్గాయని వ్యాఖ్యానించారు.
Also Read:రాహుల్ కోసమే RR ట్యాక్స్:అమిత్ షా

