దేశంలో రెండు వేర్వేరు టైమ్‌జోన్ల అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. లోక్‌సభలో బీజేడీ సభ్యుడు బి. మహ్తబ్ లేవనెత్తిన ప్రశ్నకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. మెహ్తబ్ సూచనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందని కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ తెలిపారు. మహ్తబ్ లేవనెత్తిన అంశాన్ని పరిశీలిస్తామని, సున్నితమైన విషయాన్ని లేవనెత్తారన్నారు.
తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో సూర్యోదయమయ్యే సమయాల్లో సుమారు 2 గంటల వ్యత్యాసం ఉందన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో ఉదయం 4 గంటలకే సూర్యోదయం అవుతుండగా, కార్యాలయాలు మాత్రం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతున్నాయని తెలిపారు. శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ దీనిపై గతంలో అధ్యయనం కూడా జరిపింది అని వెల్లడించారు.
దేశంలో రెండు భిన్న టైమ్ జోన్లు అమలుచేస్తే 2.7 బిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని, కార్యాలయాల పనివేళలపై కేంద్రమే ఓ నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రస్తుతం దేశ ప్రామాణిక సమయాన్ని నిర్వచిస్తున్న 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని అరగంట ముందుకు జరిపితే అస్సాం–పశ్చిమ బెంగాల్ సరిహద్దు సమీపంలోని 90 డిగ్రీల తూర్పు రేఖాంశం ప్రామాణికం కానుందని తెలిపారు.
అమెరికాలో 9 రకాల టైమ్స్ జోన్స్ ఉన్నాయి. అట్లాంటిక్ స్టాండర్డ్ టైమ్ (ఎఎస్‌టీ),ఈస్టర్న్ స్టాండర్డ్ టైమ్ (ఈఎస్‌టీ),సెంట్రల్ స్టాండర్డ్ టైమ్ (సీఎస్‌టీ),మౌంటెన్ స్టాండర్డ్ టైమ్ (ఎమ్‌ఎస్‌టీ),పసిఫిక్ స్టాండర్డ్ టైమ్ (పీఎస్‌టీ),అలస్కాన్ స్టాండర్డ్ టైమ్ (ఎకెఎస్‌టీ),హవాయ్-ఎల్యుటైన్ స్టాండర్డ్ టైమ్ (హెచ్‌ఎస్‌టీ),సమో స్టాండర్డ్ టైమ్(యుటీసీ-11),చమోర్రో స్టాండర్డ్ టైమ్(యుటీసీ-10)లు ఉన్నాయి.
అట్లాంటిక్ సముద్రతీరం ప్రాంత రాష్ట్రాలైన పెన్సిల్వేనియా, న్యూహ్యాంప్‌షైర్, జార్జియా, నార్త్, సౌత్ కరోలినా, మసాచుసెట్స్, మిచిగన్, న్యూజెర్సీ, న్యూయార్క్ తదితర రాష్ట్రాలు ఈస్ట్రన్ టైమ్ జోన్‌లో ఉంటే… ఇలినాయ్, ఫ్లోరిడా, కెంటకీ, టెక్సాస్ వంటి రాష్ట్రాలు సెంట్రల్ టైమ్ జోన్‌లో ఉన్నాయి. కీలక రాష్ట్రాలైన కాలిఫోర్నియా, నెవెడాలు పసిఫిక్ టైం జోన్‌లో, అరిజోనా, కొలరాడో, నెబ్రాస్కా, కాన్సాస్‌లు మౌంటెన్ టైమ్ జోన్‌లో ఉన్నాయి. అలాస్కా, హవాయ్‌లకు వేర్వేరు టైమ్ జోన్‌లు ఏర్పాటు చేశారు. ఒక్కో టైమ్ జోన్‌కు మధ్య గంట తేడా ఉంటుంది.