అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అమెరికా స్తంభించిపోయింది. క్రిస్మస్ పర్వదిన రోజుల్లో లక్షలాదిమంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ట్రంప్ ప్రతిపాదించిన వ్యయ బిల్లుపై డెమొక్రాట్ల నుండి వ్యతిరేకత రాడంతో ప్రభుత్వ ఆఫీసులను మూసివేయాల్సి వచ్చింది.
మెక్సికో బోర్డర్ వద్ద గోడను నిర్మించేందుకు వ్యయ బిల్లులో 5 బిలియన్ల డాలర్లు కేటాయించాలని ట్రంప్ ప్రతిపాదించారు. కానీ ఆ ప్రతిపాదనకు డెమోక్రాట్ల నుంచి వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. దీంతో వ్యయ బిల్లు కాంగ్రెస్ సభలో ఆగిపోయింది.
వ్యయ బిల్లు వాయిదా పడడంతో అమెరికా వ్యాప్తంగా హోమ్‌ల్యాండ్ సెక్యూర్టీ, ట్రాన్స్‌పోర్టేషన్, అగ్రికల్చర్, స్టేట్ అండ్ జస్టిస్ డిపార్ట్‌మెంట్లను మూసివేయనున్నారు. జాతీయ పార్కులు, అడవులను కూడా మూసివేస్తున్నారు.
వ్యయ బిల్లుకు ఆమోదం పొందకపోవడంతో ఉద్యోగులు జీతం లేకుండా పని చేయాల్సి ఉంటుంది. లేదా వాళ్లంతా పాక్షికంగా లీవ్‌పై వెళ్లాల్సి ఉంటుంది. డెమోక్రాట్లే ఈ ప్రతిష్టంభన తొలగించాలని ట్రంప్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. గత రెండేళ్లలో ఇలా ప్రభుత్వం స్తంభించడం ఇది మూడవసారి కావడం విశేషం.