మహేష్ బాబు కి బోలెడంత ఫాలోయింగ్ ఉంటుందనే సంగతి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటు కుర్రకారు నుంచి అటు ఫ్యామిలీస్ వరకు.. చిన్న పిల్లల నుంచి ఓల్డేజ్ వరకు.. పక్కా పల్లెటూళ్ల నుంచి ఫారిన్ కంట్రీస్ వరకు.. అందరూ విపరీతంగా అభిమానించే హీరో సూపర్ స్టార్. తమ అభిమాన హీరోలకు ఫ్యాన్స్ సందేశాలు పంపడం సహజమే. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయి అంతా ఈమెయిల్స్ బాట పట్టేశారు. కానీ తాజాగా నేహా అనే ఓ చిన్నారి మహేష్ బాబుకి ఓ లేఖ రాసి పంపడం విశేషం.
డియర్ మిస్టర్ ఘట్టమనేని అంటూ మొదలు పెట్టి.. తాను ఎక్కడ చదువుతోందో చెప్పిన నేహ అనే చిన్నారి.. ఎవరైనా సెలబ్రిటీకి లెటర్ రాయాలని వాళ్ల స్కూల్ లో చెప్పడంతో.. మహేష్ బాబుకు లేఖర రాయాలని ఫిక్స్ అయిందట. తన ఫేవరెట్ మూవీ శ్రీమంతుడు అంటోంది ఈ అమెరికా పాప. ఈ లెటర్ చదువుతున్నందుకు మహేష్ కి థ్యాంక్స్ కూడా చెప్పేసింది. అయితే చిన్నారులు కూడా ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తోన్న ఈ కాలంలో ఆమె రాసిన లేఖ మహేష్ బాబుకి ఎంతగానో నచ్చేసింది. దీంతో మహేష్ బాబు కూడా ఆ చిన్నారికి లేఖ రాయాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని తన ఇన్ స్ట్రాగ్రామ్ ఖాతా ద్వారా తెలియజేశాడు.
తన సినిమాల గురించి ఆమె తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఆమెలానే తన పిల్లలు సితార, గౌతమ్‌లకు ‘శ్రీమంతుడు’ చిత్రమంటే ఇష్టమని చెప్పాడు. నేహా లేఖను చదవడం నిజంగా సంతోషంగా ఉందని, నేహా బాగా చదువుకోవాలని కోరుకుంటున్నానని మహేష్ బాబు ఆ చిన్నారికి సోషల్ మీడియాతో ద్వారా కూడా సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం మహేష్ బాబు భరత్ అను నేను మూవీతో బిజీగా ఉన్నాడు.