నటి అనసూయపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ, ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి పోస్టులు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసులో వేగంగా స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల సమాచారం ప్రకారం, సికింద్రాబాద్‌కు చెందిన ఆటో డ్రైవర్ అరుణ్ కుమార్ అనే వ్యక్తి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో అనసూయపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి ప్రచారం చేస్తున్నాడు. ఈ విషయంపై ఫిర్యాదు అందిన వెంటనే సైబర్ క్రైమ్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
సాంకేతిక ఆధారాలను సేకరించి నిందితుడి వివరాలను గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై ఐటీ చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, ఫోటోలను మార్ఫింగ్ చేసి ప్రచారం చేయడం నేరమని పోలీసులు హెచ్చరించారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

Also Read:రైతు రోశయ్యకు చంద్రబాబు అభినందనలు

