సివిల్స్ టాపర్‌గా తెలంగాణ తేజం….

241
UPSC Topper Durishetty Anudeep Journey
- Advertisement -

ప్రతిష్టాత్మక సివిల్స్ – 2017 ఫలితాలు విడుదలయ్యాయి. సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు సత్తా చాటారు. తెలంగాణకు చెందిన దురిశెట్టి అనుదీప్‌ నెంబర్‌ వన్‌ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. 2013 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి అయిన అనుదీప్‌ది జగిత్యాల జిల్లా మెట్ పల్లి వాసి. సివిల్స్ టాపర్‌గా నిలిచి తెలంగాణ వ్యక్తి నిలవడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా అనుదీప్‌కు అభినందనలు తెలిపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్  సైతం అనుదీప్ కు అభినందనలు తెలిపారు. సివిల్స్‌లో ఫస్ట్ ర్యాంకు సాధించిన నిన్ను చూసి తామంతా గర్విస్తున్నామని ట్వీట్ చేశారు.

సివిల్ సర్వీసెస్ లక్ష్యంగా ప్రిపేరైన అనుదీప్.. 2013లో ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ (ఐఆర్‌ఎస్)కు ఎంపికయ్యారు. ఐఆర్‌ఎస్ ట్రెయినీ బ్యాచ్‌లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో సెంట్రల్‌ కస్టమ్స్‌ జీఎస్పీలో అసిస్టెంట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్నారు.

చిన్ననాటి నుంచే చదువుల్లో రాణిస్తూ వస్తున్న అనుదీప్‌కు ఫుట్‌బాల్ ఆట అంటే ప్రాణం. అనుదీప్‌ తండ్రి దురిశెట్టి మనోహర్ అడిషనల్ అసిస్టెంట్ ఇంజనీర్. తల్లి జ్యోతి గృహిణి. శ్రీ సూర్యోదయ హై స్కూల్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియెట్ ,2011లో బిట్స్ పిలానీ, రాజస్థాన్ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో బీటెక్ చేశారు.

తమ కుమారుడు సివిల్స్ టాపర్‌గా నిలవడం పట్ల అనుదీప్ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు అభ్యర్థులు మెరుగైన ర్యాంకులు సాధించారు. శీలం సాయితేజ (43వ ర్యాంకు), అమిలినేని భార్గవ్ తేజ 88వ ర్యాంకు,నారపురెడ్డి మౌర్య (100వ ర్యాంకు), జి.మాధురి (144వ ర్యాంకు), వివేక్ జాన్సన్ (195వ ర్యాంకు), ఎడవల్లి అక్షయ కుమార్ (624వ ర్యాంకు), భార్గవ శేఖర్ ( 816వ ర్యాంకు),సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కుమారుడు సాయి ప్రణీత్ 196వ ర్యాంకు సాధించారు.

- Advertisement -