ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పురుగు వ్యాధి స్క్రబ్ టైఫస్ భయాందోళనలు సృష్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యాధి కేసులు వేగంగా పెరుగుతుండగా, ఇటీవల విజయనగరం జిల్లాలో ఒక మహిళ ఈ వ్యాధి బారిన పడి మరణించడం కలకలం రేపింది. చీపురుపల్లి మండలం మెట్టపల్లి గ్రామానికి చెందిన రాజేశ్వరి (36) అనే మహిళను స్క్రబ్ టైఫస్‌కు కారణమయ్యే మైట్ అనే చిన్న పురుగు కుట్టడంతో అనారోగ్యానికి గురైంది. తీవ్ర జ్వరం, శరీర నొప్పులు, బలహీనత వంటి లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందినా, చివరకు ఆమె ప్రాణాలు కోల్పోయింది.
ఇక అధికారిక సమాచారం ప్రకారం, ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 1317 స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో పొదలు, పచ్చిక బయళ్లలో ఎక్కువగా కనిపించే ఈ కీటకాలు మనుషులను కుట్టినప్పుడు ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. మొదట్లో జ్వరం, తలనొప్పి, దగ్గు, చర్మంపై నలుపు రంగు మచ్చ వంటి లక్షణాలు కనపడతాయి.
వైద్యులు, ఆరోగ్య అధికారులు పౌరులను అప్రమత్తం చేస్తున్నారు. ఈ వ్యాధి భయపడాల్సిన అవసరం లేకపోయినా, లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవడం అత్యంత ముఖ్యం అని సూచిస్తున్నారు. సాధారణ యాంటీబయాటిక్స్తోనే స్క్రబ్ టైఫస్ పూర్తిగా నయం అవుతుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్లేటప్పుడు శరీరాన్ని కప్పుకునే దుస్తులు ధరించడం, పరిసరాలను శుభ్రంగా ఉంచడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Also Read:AP:డయేరియా ఘటనపై వైద్యశాఖ

