వికారాబాద్ జిల్లా పరిగిలో పూడూర్ జెడ్పీటీసీ మేఘమాల ప్రభాకర్ గుప్తా ఆద్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త పాల్గొన్నారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ.. సృష్టికి మూలం మహిళ అని.. మహిళ లేనిదే ప్రపంచం లేదన్నారు. ఒకప్పుడు కేవలం వంటింటికే మహిళలు పరిమితమయ్యారని.. కానీ నేడు సమాజంలో ఐఎఎస్, ఐపిఎస్, పైలట్ల లాంటి ఉన్నత స్థానాల్లో రాణించడంతో పాటు, రాజకీయాల్లో రాణిస్తూ ప్రజాసేవ చేస్తున్నారన్నారు. ప్రతి మగవాడి విజయం వెనుక మహిళ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రతి రంగంలోనూ మహిళలు ముందుండి విజయం సాధిస్తున్నారన్నారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మహిళల అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు.
ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం మహిళలకు సగ భాగం 75 సీట్లు కేటాయించారన్నారు. జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్‌లుగా మహిళలకే అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. ఎక్కడా లేని విధంగా మన సీఎం కేసీఆర్ మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ రాజకీయాల్లో సేవ చేసేందుకు మహిళలకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. మొన్న జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం దివంగత మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు కుమార్తె సురభి వాణీ దేవికి అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఒంటరి మహిళలకు పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సహాయం, బీడీ కార్మికులకు పెన్షన్లు అందజేస్తున్నారన్నారు. మహిళలు మరింత ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటున్నట్లు శ్రీనివాస్ గుప్త చెప్పారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జెడ్పీ చైర్మన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి,జెడ్పీ వైస్ చైర్మన్ బైండ్లా విజయ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, దోమ జెడ్పీటీసీ కొప్పుల నాగిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కల్లు ప్రసన్న లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, పరిగి ఎంపిపి కరణం అరవింద రావు, పరిగి జెడ్పీటీసీ బేతు హరిప్రియ ప్రవీణ్ రెడ్డి,పి.ఎ.సి.ఎస్ చైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి, పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ అజరుద్దీన్, పూడూర్ ఎంపిపి పుడుగుర్తి మహేష్,దోమ ఎంపిపి పటోళ్ల అనసూజ, వైశ్య నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.