మహిళలు తమ భర్తల కంటే ఎక్కువ సంపాదిస్తున్న విషయాన్ని కుటుంబ సభ్యుల దగ్గర ఎందుకు దాచిపెడుతున్నారు? దీనిపై ప్రముఖ వ్యాపారవేత్త, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భర్త కంటే భార్య ఎక్కువ సంపాదిస్తే ఏదో జరిగిపోతుందని భయపడాల్సిన అవసరం లేదని బదులుగా భర్తకు ఓ బహుమతి ఇవ్వాలని సూచించారు.
విశాఖపట్నంలో ఇటీవల జరిగిన సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026లో ఉపాసన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్‌తో జరిగిన సంభాషణలో మహిళల ఆర్థిక స్వతంత్రత, కుటుంబ బాధ్యతలు, పిల్లల పెంపకంలో భార్యాభర్తల పాత్ర వంటి అంశాలపై ఆమె మాట్లాడారు. ముఖ్యంగా మరింత మంది తల్లులు ఉద్యోగాలు, ఉపాధి రంగాల్లోకి రావాల్సిన అవసరాన్ని వివరించారు.
ఈ సందర్భంగా మహిళలు తమ భర్తల కంటే ఎక్కువ జీతం సంపాదిస్తున్న విషయాన్ని కుటుంబ సభ్యుల దగ్గర దాచిపెట్టడంపై ఉపాసన స్పందించారు. “కొన్ని సామాజిక అపోహలను తొలగించాలనుకుంటున్నాను. మా సంస్థలో ఎంతోమంది మహిళలు పనిచేస్తున్నారు. అయితే వారిలో కొందరు తమ భర్తల కంటే ఎక్కువ సంపాదిస్తున్న విషయాన్ని కుటుంబ సభ్యుల దగ్గర దాచిపెడుతున్నారు. భర్త కంటే ఎక్కువ సంపాదిస్తే ఏదో జరిగిపోతుందని, అత్తగారు చూస్తే ఏమనుకుంటారోనని భయపడుతున్నారు. నా మాట ఒక్కటే.. మీ భర్త కంటే మీరు ఎక్కువ సంపాదిస్తుంటే ఆయనకు ఓ మంచి బహుమతి కొనివ్వండి అని ఉపాసన వ్యాఖ్యానించారు.
సమాజంలో పాతుకుపోయిన ఆలోచనా విధానాలు, ఇతరులు ఏమనుకుంటారనే భయం మహిళలను ఈ విషయంలో వెనక్కి లాగుతున్నాయని తెలిపారు. గతంలో కుటుంబాన్ని పోషించే బాధ్యత పూర్తిగా పురుషులదేననే భావన ఉండేదని, భార్య ఎక్కువ సంపాదిస్తే తమ ఆధిపత్యం తగ్గిపోతుందని కొంతమంది పురుషులు భావించే అవకాశం ఉందన్నారు.
దీంతో భార్యాభర్తల మధ్య పోటీ, అభద్రతాభావం, అహం వంటి సమస్యలు తలెత్తవచ్చని వివరించారు. ముఖ్యంగా అత్తింటి వారి నుంచి ఒత్తిడి వస్తుందనే భయం కూడా కొంతమంది మహిళలను తమ ఆదాయ వివరాలను దాచిపెట్టేలా చేస్తోందన్నారు.భార్య ఎక్కువ జీతం సంపాదించడం వల్ల వివాహ బంధం దెబ్బతినదని డాక్టర్ పవిత్ర శంకర్ స్పష్టం చేశారు. భార్యాభర్తలు ఒకరినొకరు ఎలా అర్థం చేసుకుంటారు? పరస్పరం ఎంత గౌరవించుకుంటారు? అనే అంశాలపైనే వారి బంధం ఆధారపడి ఉంటుందని తెలిపారు.
Also Read:అటెండర్ మణి పాడె మోసిన సంతోష్ కుమార్
ఆర్థిక సహకారాన్ని ఆధిపత్యంతో ముడిపెట్టినప్పుడు మాత్రమే సమస్యలు వస్తాయని చెప్పారు. ఇద్దరూ తమ ఆదాయాన్ని కుటుంబ ఉమ్మడి ఆస్తిగా భావించి, ఒకరితో ఒకరు బహిరంగంగా మాట్లాడుకుంటే బంధం మరింత బలపడుతుందన్నారు. సమానత్వం అంటే ఎవరు ఎక్కువ సంపాదిస్తున్నారనే పోటీ కాదని, ఒకరిపై మరొకరికి ఉండే గౌరవమని వివరించారు.పిల్లల పెంపకంలో కూడా మహిళలపైనే ఎక్కువ బాధ్యతలు పడుతున్నాయని డాక్టర్ పవిత్ర శంకర్ అభిప్రాయపడ్డారు. సంప్రదాయ ఆలోచనా విధానంలో తల్లి అంటే పిల్లలను చూసుకునే వ్యక్తి, తండ్రి అంటే కుటుంబాన్ని పోషించే వ్యక్తి అనే భావన బలంగా ఉందన్నారు.
భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ పిల్లల సంరక్షణ, ఇంటి పనులు, కుటుంబ నిర్వహణకు సంబంధించిన మానసిక ఒత్తిడి ఎక్కువగా మహిళలపైనే ఉంటోందని పేర్కొన్నారు.

