IPL 2027:వేలానికి బెన్ స్టోక్స్!

1
- Advertisement -

ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఐపీఎల్ 2027 వేలానికి తన పేరును నమోదు చేసుకున్నాడు. రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి రాబోతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఈ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌పై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించగల సామర్థ్యం ఉండటంతో మూడు జట్లు అతడిని దక్కించుకునేందుకు పోటీపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మాజీ ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ ఐపీఎల్ 2027 వేలం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌పై దృష్టి పెట్టడం, పని భారాన్ని తగ్గించుకోవడం కోసం గత రెండేళ్లుగా ఐపీఎల్‌కు దూరంగా ఉన్నాడు. అయితే తాజాగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో ఇకపై ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఎక్కువగా ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే అత్యధిక బేస్ ప్రైస్ విభాగమైన రూ.2 కోట్ల కనీస ధరతో తన పేరును నమోదు చేసుకున్నట్లు క్రిక్‌ఇన్ఫో వెల్లడించింది.

ఇక 2027 ఐపీఎల్ వేలం డిసెంబర్ 16న గోవాలో జరగనుంది. 2025 మెగా వేలానికి ముందు తీసుకొచ్చిన నిబంధన కారణంగా స్టోక్స్ రెండేళ్ల పాటు వేలంలో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. గతంలో ఐపీఎల్ ఆడిన ఆటగాళ్లు మెగా వేలానికి తమ పేరును నమోదు చేసుకోకపోతే, ఆ తర్వాత జరిగే మినీ వేలంలో పాల్గొనడానికి వీలుండదు. దీంతో బెన్ స్టోక్స్ తిరిగి వేలంలోకి రావడానికి 2027 వరకు వేచి చూడాల్సి వచ్చింది.

బెన్ స్టోక్స్ చివరిసారిగా 2023లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్ ఆడాడు. అంతకుముందు మూడు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. 2017లో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ అతడిని రూ.14.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత 2023లో చెన్నై సూపర్ కింగ్స్ రూ.16.25 కోట్లు వెచ్చించి జట్టులోకి తీసుకుంది. అయితే మోకాలి గాయం కారణంగా ఆ సీజన్‌లో కేవలం రెండు మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు.

Also Read:అటెండర్ మణి పాడె మోసిన సంతోష్ కుమార్

మరోవైపు సెప్టెంబర్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్‌తో ఒప్పందం చేసుకున్న స్టోక్స్ బిగ్ బాష్ లీగ్‌లోనూ ఆడనున్నాడు. ఈ ఒప్పందం విలువ సుమారు 5 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లుగా ఉన్నట్లు సమాచారం. ఐపీఎల్‌లోకి తిరిగి వస్తున్న స్టోక్స్‌పై ఫ్రాంచైజీలు భారీగా ఆసక్తి చూపించే అవకాశం ఉంది.

- Advertisement -