కాలేజీలు రీ ఓపెన్‌…యూజీసీ మార్గదర్శకాలివే

140
ugc
- Advertisement -

కరోనా కారణంగా నిలిపివేసిన విద్యాకార్యకలాపాలను దశల వారీగా నిర్వహించుకోవచ్చని తెలిపింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్​. ఈ మేరకు కళాశాలలు, విశ్వవిద్యాలయాల పునఃప్రారంభానికి మార్గదర్శకాలు జారీ చేసింది యూజీసీ.భౌతిక తరగతుల ప్రారంభానికి సాధ్యమయ్యే విషయాలను పరిశీలించాలని, పూర్తిగా సురక్షితం అనుకున్న తర్వాతే కార్యకలాపాలకు సిద్ధం కావాలని స్పష్టం చేసింది.

వర్సీటీలు, కళాశాలల క్యాంపస్‌లను దశలవారీగా తెరవడానికి ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని సూచించింది.వర్సిటీలు, కళాశాలల పరిపాలనా కార్యాలయాలు, పరిశోధన ప్రయోగశాలలు, గ్రంథాలయాలు కూడా తెరిచేందుకు అనుమతిచ్చింది.విద్యార్థులు తమ తమ విద్యాలయాల్లో తిరిగి చేరవచ్చని పేర్కొన్న యూజీసీ…..మొత్తం విద్యార్థులలో 50 శాతం కంటే ఎక్కువ మంది ఏ సమయంలోనైనా హాజరుకాకుండా చూసుకోవాలని తెలిపింది.

కొవిడ్-‌19 వ్యాప్తిని నివారణకు అవసరమైన మార్గదర్శకాలు, ప్రొటోకాల్స్‌ తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని…ఆన్‌లైన్ తరగతులు ఇష్టపడే విద్యార్థుల కోసం బోధనా విధానం కొనసాగుతుందన్నారు.అందుకోసం సంస్థలు ఆన్‌లైన్ స్టడీ మెటీరియల్‌ను అందుబాటులోకి తీసుకురావాలి….అవసరమైతే తప్ప విద్యార్థులు అధ్యాపకులతో ఎలాంటి సంప్రదింపులు చేయరాదు.ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతే అధ్యాపకులతో సంప్రదింపులు జరపాలి.అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షలు, వీసా సంబంధిత సమస్యల కారణంగా తిరిగి విద్యాలయాల్లో చేరలేని అంతర్జాతీయ విద్యార్థుల కోసం విద్యాసంస్థలు ప్రణాళిక రూపొందించాలి.వారికి ఆన్‌లైన్ ద్వారా బోధన సాగించే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు.

భద్రత, ఆరోగ్య నివారణ చర్యలను కచ్చితంగా పాటిస్తూ అవసరమైన సందర్భాల్లో మాత్రమే హాస్టళ్లు తెరవాలి.కొవిడ్‌ లక్షణాలు ఉన్న విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ హాస్టళ్లలో ఉండటానికి అనుమతించకూడదు.ఏదైనా క్యాంపస్ తిరిగి తెరిచే ముందు విద్యా సంస్థలు ఉన్న ప్రాంతాన్ని ఆయా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సురక్షిత ప్రాంతంగా ప్రకటించాలి.కొవిడ్‌-19 దృష్ట్యా భద్రత, ఆరోగ్యానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాలు, సూచనలు, మార్గదర్శకాలు, ఉత్తర్వులను ఉన్నత విద్యాసంస్థలు తప్పక పాటించాలన్నారు.

- Advertisement -