స్వచ్ఛభారత్ పేరిట ప్రధాని మోదీ పరిసరాల పరిశుభ్రతపై ఉద్యమం చేపడుతుంటే… దానికి కేంద్రమంత్రి తన బహిరంగ చర్యతో తూట్లు పొడిచారు. పబ్లిగ్గా యూరిన్ చేస్తున్న కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఫొటోను పరిశీలిస్తే… సదరు మంత్రిగారు కారును ఆపి మరీ సెక్యూరిటీ గార్డుల సంరక్షణలో బహిరంగంగా మూత్ర విసర్జన చేశారు.
ఈ ఘనకార్యం నిర్వహిస్తుండగా సెక్యూరిటీ గార్డులు కాపలా కాయడం విశేషం. పైగా ఆయన నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కొనసాగుతుండటం గమనార్హం. దీంతో నెటిజన్లతో పాటు విపక్షాలకు చెందిన నేతలు తమ మేధస్సుకు పదునుపెట్టి మరీ.. ఈ ఉదంతంపై ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఈ ఫొటొ నెట్టింట్లోకి ఎప్పుడు చేరింది? ఈ ఘటన ఎక్కడ జరిగిందనే వివరాలేవి లేవు. అయితే ఓ వైపు ప్రభుత్వ యంత్రాంగమంతా మోదీ మానస పుత్రికలా భావిస్తున్న.. ‘స్వచ్ఛ్ భారత్’ కార్యక్రమం కోసం విస్తృతంగా ప్రచారం చేస్తుండగా.. ఆయన మంత్రి వర్గానికే చెందిన వ్యక్తి ఇలా చేయడం సంచలనానికి కారణమైంది.
అదీ కాకుండా.. ఎర్ర బుగ్గల సంప్రదాయాన్ని వదిలేయాలని కేంద్రం గట్టిగా చెబుతున్నా.. రాధా మోహన్ సింగ్ తన కాన్వాయ్‌లో ఇంకా వాటిని వాడుతుండటంపై మరికొంత మంది నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
‘ధోవతీ ధరించిన ఈ మంత్రి నిల్చొనే యూరిన్ చేసిన అంశాన్ని ప్రశంసించాల్సిందే’ అంటూ ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. ఆ మంత్రిపై తగిన చర్య తీసుకోవాలంటూ మరి కొంత మంది డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా .మంత్రులే ఈ విధంగా చేస్తుంటే ఇక సామాన్యులు వారు చెప్పేమాటలను ఎలా వింటారని కూడా నెటిజన్లు మండిపడుతున్నారు.