కేంద్ర మంత్రికి కేటీఆర్‌ లేఖ..

221
- Advertisement -

కేంద్ర కెమికల్స్ మరియు ఫెర్టిలైజర్స్ శాఖ మంత్రి వి. సదానందగౌడకి తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కే. తారక రామారావు ఈరోజు ఒక లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన పరిశ్రమ అభివృద్ధి చేపట్టాల్సిన చర్యలు, సంస్కరణలపైన కొన్ని వివరాలను ఈలేఖలో మంత్రి కెటియార్ సూచించారు. ప్రస్తుతం ప్రపంచమంత ఎదుర్కొంటున్న సంక్షోభ కాలంలోనూ, దాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన మందులను తయారు చేస్తూ, సరఫరా చేస్తూ దేశ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అందరికీ గర్వకారణంగా నిలిచిందని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ భారతదేశ ఫార్మాస్యూటికల్ హబ్ గా కొనసాగుతున్నదని సుమారు 800 లైఫ్ సైన్సెస్ కంపెనీలు తెలంగాణలో ఉన్నాయని, 35% కంటే ఎక్కువగా జాతీయ ఉత్పత్తిలో తెలంగాణ నే అందిస్తుందని తెలిపారు. ఈ రంగంలో సుమారు లక్షా 20 వేల మందిని ఉపాధి కల్పిస్తుందని తెలిపారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ రంగానికి దాని అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తన పరిధిలో అవసరమైన మేర కృషి చేస్తూ వస్తుందని తెలిపారు. ప్రస్తుతం లాక్ డౌన్ పరిస్థితుల కాలంలో వాటి ఉత్పాదన సామర్ధ్యంతో పోల్చితే తక్కువ కెపాసిటీతో నడిపించడం, లేబర్ కొరత వంటి సమస్యల వలన అనేక సవాళ్లు ప్రస్తుతం పార్మ రంగం ఎదుర్కొంటుందని తెలిపారు. ఫార్మాస్యూటికల్ రంగం లో 80% చిన్న మధ్య తరహా కంపెనీల ఉన్నందున, వాటికి ప్రస్తుత సంక్షోభ కాలంలో ప్రభుత్వ మద్దతు ఎంతో అవసరమని తెలిపారు. ప్రస్తుతం తాను సూచిస్తున్న కొన్ని సంస్కరణలు ఇతర చర్యల వలన ఆయా రంగం యొక్క ప్రగతి తో పాటు ప్రపంచంలో భారత ఫార్మా రంగ నాయకత్వ స్థానం మరింత సుస్థిరం అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి ఫార్మా రంగం యొక్క ప్రతినిధులతో పలుమార్లు చర్చించిన తర్వాత ఈ లేఖ రాసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

KTR

ప్రస్తుతం ఫార్మా పరిశ్రమ పైన ఆర్థిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నదని ప్రస్తుతం కంపెనీలు పూర్తిస్థాయిలో నడిచేటువంటి పరిస్థితి లేనందున ఆయా కంపెనీలు రా మెటీరియల్స్ మరియు ఇతర ఖర్చులు పెరగడం వలన అవి విపరీతమైన ఫైనాన్షియల్ స్ర్టేస్ లో ఉన్నట్టు తెలిపిన మంత్రి, వాటికి ఇన్కమ్ టాక్స్ మరియు జిఎస్టి రిఫండ్ లను వెంటనే చెల్లించాలన్నారు. దీంతో పాటు కనీసం ఆరు నెలల పాటు పన్నులకు సంబంధించిన మారటోరియం విధించాలన్నారు. ఈ అవకాశాన్ని కనీసం ఈ రంగంలోని యంయస్ యంఈలకైనా అందించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఎగుమతుల ప్రోత్సాహక పథకాలకు సంబంధించిన ప్రోత్సాహకాలను అతి తక్కువ ప్రక్రియతో పూర్తిచేసేందుకు వాటిని సరళతరం చేయాలని, పెండింగ్ ప్రోత్సాహకాలన్నింటిని వెంటనే విడుదల చేయాలని కోరారు.

చైనా వంటి దేశాల పోటీని ఎదుర్కొనేందుకు భారత ఫార్మా కంపెనీలకు సాధ్యమైనన్ని ఎక్కువగా ఎగుమతి ప్రోత్సాహకాలను కల్పించాలని కోరారు. ప్రస్తుతం అనేక సార్లు ఆర్బిఐ వడ్డీ రేట్లను తగ్గిస్తూ వస్తుందని, అయితే తగ్గిన వడ్డీరేట్ల మేరకు ఫార్మ రంగ కంపెనీలకు రుణాలు అందించేలా కమర్షియల్ బ్యాంకులను ఆదేశించాలని కోరారు. ప్రస్తుత లాక్ డౌన్ మార్గదర్శకాలను అమలు చేస్తూ ఉత్పత్తి కొనసాగించడం ఖర్చుతో కూడుకున్న విషయం అయిన నేపథ్యంలో అత్యవసరం కానీ మందుల రేట్లను నిర్ధారించడంలో 10 శాతం వరకు ఉదారంగా వ్యవహరించాలని సూచించారు. ఇతర దేశాల నుంచి ముడి సరుకులను దిగుమతి చేసుకుంటున్న కంపెనీలకు ప్రస్తుతం పోర్టుల వద్ద వద్ద విపరీతమైన ఆలస్యం అవుతుందని, దీన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పోర్టు సంబంధిత ఖర్చులను కనీసం ఆరు నెలల పాటు ఫార్మా కంపెనీల వద్ద వసూలు చేయవద్దని కోరారు. ప్రస్తుతం ఇతర దేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భారతదేశ ఫార్మా రంగంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను మరింత పెంచేందుకు ఆ రంగంలోని నిపుణులతో ఒక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయాలని కోరారు.

పైన పేర్కొన్న అన్ని సూచనలు స్వల్ప కాలానికి సంబంధించినవి కాగా సుదీర్ఘ కాలంలో భారత్ ఫార్మా రంగానికి మరింత బలోపేతం చేసేందుకు దీర్ఘకాలికంగా తీసుకోవలసిన చర్యలను మంత్రి సూచించారు.
ముఖ్యంగా ఫార్మా రంగానికి కావలసిన ముడి సరుకులు ఏపీఐలకు సంబంధించి చైనాపైన ఆధారపడడం తగ్గించాలని కోరారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తామన్న మూడు బల్క్ డ్రగ్ మాన్యుఫాక్చరింగ్ పార్కులను స్వాగతిస్తున్నామని తెలిపారు. చైనాతో పోలిస్తే 30 నుంచి 40 శాతం ఉత్పాదన ఖర్చు భారత్లో ఎక్కువగా ఉన్నదని,దీన్ని తగ్గించేందుకు వెంటనే వివిధ చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద సమీకృత ఫార్మా క్లస్టర్ హైదరాబాద్ ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తుందని, జాతీయ ప్రాధాన్యత ఉన్న దీనికి ఇప్పటికే నిమ్జ్ హోదా వచ్చిందని, భవిష్యత్తులోనూ భారత్లోకి పెట్టుబడులతో వచ్చే కంపెనీలను ఇక్కడికి వచ్చేలా కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ఈ సందర్భంగా కోరారు.

భారత దేశాన్ని మరింత ఆకర్ష వంతమైన పెట్టుబడి గమ్యస్థానంగా మార్చేందుకు ప్రస్తుతం ఉన్న పాలసీ స్ట్రక్చర్ ను పూర్తిగా మార్చి నూతన ఫార్మాస్యూటికల్ పాలసీని తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు. ఫార్మా రంగం నుంచి మరిన్ని ఎగుమతులు పెంచేలా ప్రత్యేక ఫార్మా ఎక్స్పోర్ట్ స్కీం ఒకదాని ప్రవేశపెట్టాలని సూచించారు. భారతదేశంలోని ఫార్మా రంగంలో ఎమ్మెస్ ఎంఈల పాత్ర అత్యంత కీలకమైనదని, ప్రస్తుతం పది కోట్ల రూపాయల పెట్టుబడి అనేది ఒక అర్హతగా ఉందని, దీన్ని మార్చి 250 కోట్ల రూపాయల వార్షిక టర్నోవర్ ఆధారంగా ఆయా కంపెనీలను యంయస్ యంఈలుగా గుర్తించాలని సూచించారు. దీంతోపాటు సూక్ష్మ మరియు మధ్యతరహా ఫార్మా కంపెనీలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన ఇతర మినహాయింపులు ప్రోత్సాహకాల పైన ప్రత్యేకంగా పలు చర్యలను మంత్రి ఈ సందర్భంగా సూచించారు. దీంతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాలలో తయారయ్యే ఫార్మా రంగం ఉత్పత్తుల నాణ్యత తక్కువగా ఉంటుందన్న ప్రచారం వలన భారత ఫార్మా పరిశ్రమ కొన్ని అవకాశాలను కోల్పోతుందని, దీన్ని అధిగమించేందుకు లక్షిత దేశాలతో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించి ప్రస్తుతం ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. దీంతోపాటు భారత ఫార్మా రంగా ఉత్పాదన ప్రమాణాలను పెంచేందుకు ఒక టాస్క్ఫోర్స్ను కూడా ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించాలన్నారు. ఫార్మా రంగానికి సంబంధించి పరిశోధన మరియు అభివృద్ధి ఈకో సిస్టమ్ ని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన పలు చర్యల పైన మంత్రి సూచనలు చేశారు. ఫార్మా రంగ అనుమతులకు సంబంధించిన ప్రత్యేక వ్యవస్థను వీకేంద్రదీకృత స్ధాయిలో ఎర్పాటు చేయాలన్నారు.

- Advertisement -