నేటి నుంచి ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ లోక్‌సభలో 2017-18 సర్వేను ప్రవేశపెట్టారు. ఆర్థిక సంవత్సరం 2019లో జీడీపీ వృద్ధి రేటు 7 శాతం నుంచి 7.5 శాతం వరకు పెరుగుతుందని 2018 ఆర్థిక సర్వే అంచనావేసింది.
జీఎస్టీ వంటి పలు సంస్కరణలు ప్రవేశపెట్టిన అనంతరం మార్చితో ముగిసే ఈ ఆర్థిక సంవత్సరంలో రియల్ జీడీపీ వృద్ధి రేటు 6.75 శాతంగా ఉండనున్నట్టు తెలిపింది. వ్యవసాయం, విద్య, ఉపాధిలపై ఎక్కువగా దృష్టిసారించాల్సి ఉందని ఆర్థిక సర్వే పేర్కొంది.
ఇక ఈ సర్వేలో త్రైమాసిక వృద్ధిరేటును పరిశీలిస్తే వార్షిక వృద్ధిరేటు మందగిస్తున్నట్లు కనిపించిందని జైట్లీ తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థకు జీఎస్టీ(వస్తు, సేవల పన్ను) కొత్త ఊపునిచ్చిందన్నారు. జీఎస్టీ అమలు తర్వాత పారిశ్రామిక వృద్ధిరేటులో కొంత మందగమనం ఉందన్నారు. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్లో గణనీయంగా రాబడి పెరిగిందని తెలిపారు.
ఇక తయారీ రంగంపై ఓ గుడ్‌న్యూస్‌ను కూడా ప్రకటించారు అరుణ్‌జైట్లీ. తొలిసారి భారతీయ చరిత్రలో మహారాష్ట్ర, గుజరాత్, కర్నాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు దేశీయ ఎగుమతుల్లో 70 శాతాన్ని నమోదుచేసినట్టు పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం 2018లో సర్వీసు వృద్ధి 8.3 శాతం, పరిశ్రమల వృద్ధి 4.4 శాతం, వ్యవసాయ వృద్ధి 2.1 శాతంగా ఉన్నట్టు అంచనావేశారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ తర్వాత కొత్తగా పన్ను చెల్లింపుదారులు 50 శాతం పెరిగారని, వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు కూడా పెరిగినట్టు తెలిపారు.
కాగా… సర్వే అనంతరం లోక్‌సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్ సుమిత్రా మహాజన్.