తెలుగులో స్టార్ కమెడియన్ గా హవా కొనసాగిస్తున్న సమయంలో కామెడీ రోల్స్ కి గుడ్ బై చెప్పి హీరోగా తన కెరీర్ ప్రారంభించాడు సునీల్. ఆ సమయంలో స్టార్ హీరోల సినిమాల్లో కమెడియన్ గా అవకాశాలు వచ్చినా అంగీకరించలేదు సునీల్. అయితే కొంతకాలంగా సునీల్‌కు పెద్ద విజయం దక్కలేదు. `ఉంగరాల రాంబాబు` కోసం సునీల్ – క్రాంతిమాధవ్ జట్టుకట్టారు. ఒక విభిన్నమైన కలయికగా అటు పరిశ్రమ, ఇటు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిందీ సినిమా. `ఓనమాలు`, `మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు` వంటి చిత్రాలతో మంచి చిత్రాలు చేసిన క్రాంతిమాధవ్ `ఉంగరాల రాంబాబు` ఎలా ఉందో రివ్యూలో చదవండి..
కథ:
రాంబాబు(సునీల్) పుట్టుకతోనే ధనవంతుడు. రూ. 200 కోట్లకు ఆస్తికి వారసుడైన రాంబాబుకు ఎలాంటి కష్టం తెలియకుండా పెరుగుతాడు. ఒక సమయంలో తన తాత చనిపోవడంతో ఆస్తులన్నీ పోయి, రోడ్డున పడతాడు రాంబాబు. ఈ సమయంలో రాంబాబుకి బాదం బాబా (పోసాని కృష్ణమురళి) ఆశ్రమం కనిపిస్తుంది. ఏం చేయాలో తెలియని రాంబాబు బాదం బాబాను ఆశ్రయిస్తాడు. రాంబాబు వేసుకొన్న సూటూ బూటూ చూసి నువ్వు మహర్జాతకుడువని, తాను చెప్పిన చోట బాదం చెట్టు నాటితే నీ ఆస్తి నీకు తిరిగొస్తుందంటాడు బాదం బాబా. చెప్పినట్లే బాదం చెట్టు నాటడానికి వెళితే అక్కడ 200 కోట్ల బంగారం దొరుకుతుంది. అప్పట్నుంచి జాతకాలపై మరింత నమ్మకం పెంచుకున్న రాంబాబు.. బాదంబాబా ఏం చెబితే అది చేస్తుంటాడు. అప్పటిదాకా మామూలు రాంబాబు కాస్తా బాదం బాబాను కలిశాక ఉంగరాల రాంబాబు అయిపోతాడు.ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ పెట్టి వంద వోల్వో బస్సులు తిప్పుతుంటాడు. వ్యాపారంలో రోజూ ఏదో ఒక చికాకు వస్తుండటంతో ఫలానా జాతకం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని బాదం బాబా సలహా ఇస్తాడు. ఆ జాతకం ఉన్న అమ్మాయి తన ఆఫీసులోనే ఉన్న తన మేనేజర్ సావిత్రి (మియా జార్జ్) అని తెలిశాక ఆమెని ప్రేమించడం మొదలుపెడతాడు. అయితే, ఆమెకు మాత్రం తన పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఎలా ఉండాలి అన్నదానిపై కొన్ని అభిప్రాయాలుంటాయి. ఎలాగో తిప్పలు పడి ఆమె ప్రేమను దక్కించుకుంటే, కమ్యూనిస్ట్ అయిన ఆమె తండ్రి రంగా(ప్రకాష్ రాజ్) రాంబాబు ప్రేమకు అడ్డు పడతాడు. మరి నిజంగా సావిత్రిది బాబా చెప్పిన జాతకమేనా? వాళ్లిద్దరి ప్రేమకథ సఫలమైందా? అసలు రాంబాబుకి దొరికిన 200 కోట్ల బంగారం ఎవరిది? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
క్రాంతి మాధవ్ డైరెక్షన్ బాగుంది. సునీల్ ఎప్పట్లాగే తనకి తెలిసిన అన్ని విద్యలూ ప్రదర్శించాడు. కమెడియన్ గా ఉన్న రోజుల్లో సునీల్ ఎలా ఉన్నాడో అలాంటి ఫీల్ ని ఈ సినిమాలో తెచ్చే ప్రయత్నం చేశారు. తనదైన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్ తో ప్రేక్షకులను బాగా నవ్విచాడు. ఇక తమిళ, మళయాళ పరిశ్రమల్లో సినిమాలు చేస్తున్న మియా జార్జి, తన ఫస్ట్ తెలుగు సినిమా అయినా కూడా బాగానే నటించింది. ప్రకాష్ రాజ్ నటన గురించి చెప్పాల్సిందేమిలేదు.. కమ్యూనిస్ట్ నాయకుడు రంగరాజన్ పాత్రలో ఒదిగిపోయాడు.బాదం బాబా గా పోసాని, చే గువేరాగా వెన్నెల కిషోర్ నవ్విస్తారు.
మైనస్ పాయింట్స్:
క్రాంతి మాధవ్ డైరెక్షన్ బాగుంది కానీ సెకండాఫ్ లో మరీ విప్లవాత్మక సంభాషణలు, ఈ తరం ఆడియన్స్ కు బోరింగ్ గా అనిపిస్తాయి. జాతకాలపై పిచ్చి ఉన్న రాంబాబు పాత్ర, కమ్యూనిస్టు నాయకుడైన రంగనాయర్( ప్రకాష్‌రాజ్), పోసాని చేసిన బాదం బాబా పాత్రలను సరిగ్గా నడిపించడంలోనూ, వాటి చుట్టూ సన్నివేశాలను అల్లుకోవడంలోనూ దర్శకుడు తడబడ్డాడు. మంచి సినిమాలు తీసిన క్రాంతి మాధవ్ ఈసారి చెప్పాలనుకొన్న కథని చెప్పడంలో తడబడ్డాడు. మియా జార్జ్ పాటలకి, కొన్ని డైలాగులకి పరిమితమైంది తప్ప, ఆమె పాత్రకి పెద్ద ప్రాధాన్యం లేదు. ప్రకాశ్ రాజ్ పాత్రలో బలం లేదు. మొత్తంగా దర్శకుడు తీర్చిదిద్దిన కథ కారణంగా ఆయా సన్నివేశాలకు స్కోప్‌లేకుండా పోయింది.
సాంకేతిక విభాగం:
మంచి సినిమాలు తీసిన క్రాంతి మాధవ్ ఈసారి తడబడ్డాడు. కథ, కథనాలపై మరిన్ని కసరత్తులు చేయాల్సింది. సర్వేష్ మురారి అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. పల్లెటూరి అందాలను బాగా చూపించారు. ఇక గిబ్రాన్ సంగీతం అందించిన పాటలు బాగోలేవు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపించింది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాత పరుచూరి కిరీటీ సినిమాను చాలా గ్రాండ్‌గా తీర్చిదిద్దారు.. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు:
కమెడియన్ నుండి హీరో అయిన తర్వాత సునీల్ కి “మర్యాద రామన్న” తప్ప పెద్దగా హిట్స్ రాలేదు. ఎమోషన్స్, లవ్, కామెడీ అన్ని బాగానే ఉన్నాయి ఈ సినిమాలో. కాకపోతే ఒక్క మాటలో చెప్పాలంటే సునీల్ గత సినిమాలన్నీ మిక్స్ చేసి ఈ సినిమా చూసినట్టు అనిపిస్తుందే తప్ప ఉంగరాల రాంబాబు లో కొత్తదనం ఏమి లేదు.
విడుదల తేదీ: 15/09/2017
రేటింగ్ : 2. 5/5
నటీనటులుః సునీల్, మియా జార్జ్, ప్రకాష్ రాజ్
సంగీతం : జిబ్రాన్
నిర్మాతః పరుచూరి కిరీటి
దర్శకత్వం : కె.క్రాంతి మాధవ్