దక్షిణ ఆసియాలో ఉగ్రవాదంపై ఐక్యరాజ్యసమితి (యూఎన్) విడుదల చేసిన 37వ నివేదికలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. యూఎన్ అనలిటికల్ సపోర్ట్ అండ్ సాంక్షన్స్ మానిటరింగ్ టీమ్ నివేదిక ప్రకారం, నవంబర్ 10న న్యూఢిల్లీ రెడ్ ఫోర్ట్ సమీపంలో జరిగిన దాడికి పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న జైష్-ఎ-మహ్మద్ (JeM) సంస్థకు సంబంధం ఉన్నట్లు పేర్కొంది.
ఒక సభ్య దేశం యూఎన్‌కు అందించిన సమాచారం మేరకు ఈ దాడికి జైష్-ఎ-మహ్మద్ బాధ్యత వహించినట్లు ప్రకటించిందని తెలిపింది. ఇంతకుముందు అక్టోబర్ 8న జైష్ చీఫ్ మసూద్ అజర్ జమాత్-ఉల్-ముమినాత్ పేరుతో మహిళల విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించాడు. ఈ విభాగం యూఎన్ జాబితాలో లేకపోయినా, ఉగ్ర కార్యకలాపాలకు మద్దతు ఇస్తోందనే ఆరోపణలు ఉన్నాయి.
అలాగే, జైష్ ప్రస్తుత స్థితిపై యూఎన్ సభ్య దేశాల మధ్య విభిన్న అభిప్రాయాలు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఒక దేశం ఆ సంస్థ ఇప్పటికీ సక్రియంగానే ఉందని చెప్పగా, మరొక దేశం అది “నిష్క్రియ” అయిందని పేర్కొంది. అయితే యూఎన్ ఆంక్షల తర్వాత జైష్ మరియు లష్కర్-ఎ-తయిబా సంస్థలు ఇకపై క్రియాశీలంగా లేవని పాకిస్తాన్ గతంలో తెలిపింది.
నివేదికలో 2025 ఏప్రిల్‌లో జరిగిన పహల్గామ్ దాడిని కూడా ప్రస్తావించారు. ఆ దాడిలో 26 మంది పౌరులు మృతి చెందారు. ఈ దాడిని లష్కర్-ఎ-తయిబా అనుబంధ సంస్థగా భావిస్తున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ నిర్వహించినట్లు పేర్కొన్నారు.
Also Read:సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

