ప్రియురాలితో​ రహస్య వివాహం చేసుకున్న బ్రిటన్​ ప్రధాని..

38
UK PM

బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​​ వివాహం చేసుకున్నట్లు సమాచారం. ప్రియురాలు క్యారీ సైమండ్స్​తో శనివారం బోరిస్​ రహస్య వివాహం జరిగినట్లు తెలుస్తోంది. లండన్​లో వెస్ట్​మినిస్టర్​ క్యాథెడ్రల్​లో ఆయన వివాహం చేసుకున్నారని ది సన్​, మెయిల్​ ఆన్​ సండేవర్క్​ లాంటి టాబ్లాయిడ్​లు ప్రముఖంగా ప్రచురించాయి. ఇరు కుటుంబాలు, స్నేహితుల సమక్షంలో నిరాడంబరంగా జరిగిన వేడుకలో నెచ్చెలితో వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం లాక్‌డౌన్‌ నిబంధనలు అమలులో ఉండడంతో పెళ్లి కార్యక్రమానికి 30 మందికి మాత్రమే అనుమతి ఉంది. దీనిపై బోరిస్‌ జాన్సన్‌ డౌనింగ్‌ స్ట్రీట్‌ కార్యాలయ ప్రతినిధిని సంప్రదించగా.. స్పందించేందుకు నిరాకరించారు.

జాన్సన్‌కు ఇది మూడో వివాహం కాగా.. 2020 ఫిబ్రవరిలో నిశ్చితార్ధం చేసుకున్నట్లు జాన్సన్‌, సైమండ్స్‌ ప్రకటించారు. బ్రిటన్‌ ప్రధానికి 56 ఏళ్ల వయస్సు కాగా.. క్యారీ సైమండ్స్‌కు 33 సంవత్సరాలు. వీరికి ఇప్పటికే ఏడాది వయసున్న కుమారుడు ఉన్నారు. 2019లో జాన్సన్ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఇద్దరూ డౌనింగ్ స్ట్రీట్లో కలిసి నివసిస్తున్నారు. 1822లో లార్డ్‌ లివర్‌పూల్‌ తర్వాత బ్రిటన్‌ ప్రధాని పదవిలో ఉంటూ వివాహం చేసుకున్న తొలి వ్యక్తి బోరిస్‌ జాన్సన్‌.