దేశంలోని బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి బ్రిటన్‌కు పారిపోయి తలదాచుకున్న విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను భారత్‌కు రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు బ్రిటన్ షాకిచ్చింది. వారిని అప్పగిస్తామంటూనే మెలిక పెట్టింది. ప్రస్తుతం బ్రిటన్‌లో 75 వేల మంది వలసదారులు అక్రమంగా నివసిస్తున్నారు. వీరిలో అత్యధికులు భారతీయులే. వారందరినీ దేశం నుంచి పంపించేందుకు సహకరిస్తేనే వారిని అప్పగిస్తామని షరతు పెట్టింది.
అక్రమ వలసదారులపై అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై తుది సంతకం చేసే అంశాన్ని బ్రిటన్ మంత్రి బారోనెస్ విలియమ్స్.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు వద్ద లేవనెత్తినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత్‌కు చెందిన అక్రమ వలసదారులను గుర్తించిన నెలరోజుల్లోనే స్వదేశానికి తిప్పిపంపడానికి బ్రిటన్ అధికారులకు దీనివల్ల వీలు కలుగుతుందని పేర్కొన్నాయి. విలియమ్స్, రిజిజు మధ్య సోమవారం చర్చలు సాగాయి.
నీరవ్ మోదీ, మాల్యా తదితరుల అప్పగింత అంశాన్ని భారత బృందం లేవనెత్తింది. నీరవ్ తమ దేశంలోనే ఉన్నారని బ్రిటన్ అధికారులు ఈ సందర్భంగా నిర్ధరించారు. ‘‘వీరి అప్పగింతను.. ఎంవోయూపై సంతకంతో బ్రిటన్ ముడిపెడుతుందని ఆందోళన చెందుతున్నాం’’ అని ఓ అధికారి పేర్కొన్నారు. నిజానికి ఒప్పందం ముసాయిదాపై ఈ ఏడాది జనవరిలో రిజిజు సంతకం చేశారు. ప్రధాని మోదీ ఏప్రిల్‌లో బ్రిటన్‌లో పర్యటించినప్పుడు లాంఛనప్రాయంగా తుది ఎంవోయూపై సంతకం చేయాల్సింది. ప్రభుత్వంలోని కొన్ని వర్గాలు లేవనెత్తిన ఆందోళనల వల్ల భారత్ ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంది.