UK:జంక్ ఫుడ్ ప్రకటనలపై ఆంక్షలు!

5
- Advertisement -

పిల్లలను లక్ష్యంగా చేసుకుని జంక్ ఫుడ్ ప్రకటనలు ఇవ్వడంపై యూకే ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేసింది. ఈ వారం నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం, అనేక రకాల ప్రాసెస్డ్ ఆహారాలు, పానీయాలకు సంబంధించిన ఆన్‌లైన్ ప్రకటనలను పూర్తిగా నిషేధించారు. అలాగే టెలివిజన్‌లో ఇవి రాత్రి 9 గంటల తర్వాత మాత్రమే ప్రసారం చేయాల్సి ఉంటుంది అని ది గార్డియన్ వెల్లడించింది.

ఈ నిర్ణయం యూకేలో పెరుగుతున్న పిల్లల స్థూలకాయం (చైల్డ్‌హుడ్ ఒబేసిటీ) సమస్యను ఎదుర్కొనే ఉద్దేశంతో తీసుకున్నారు. ఇది చాలా సంవత్సరాలుగా ప్రజారోగ్యానికి పెద్ద సవాలుగా మారింది. కొత్త నిబంధనల ప్రకారం 13 కేటగిరీల ఉత్పత్తుల ప్రకటనలపై ఆంక్షలు విధించారు. ఇందులో చక్కెర కలిగిన సాఫ్ట్ డ్రింక్స్, చిప్స్, చాక్లెట్లు, మిఠాయిలు వంటి వాటి ప్రకటనలు ఉన్నాయి. ఇవి ఆన్‌లైన్‌లో పూర్తిగా నిషేధించబడ్డాయి. టీవీలో మాత్రం రాత్రి 9 గంటల తర్వాతే ప్రసారం చేయాలి.

ఈ ఆంక్షల ప్రధాన లక్ష్యం కొవ్వు, చక్కెర, ఉప్పు అధికంగా ఉండే ఆహారాల ప్రకటనల నుంచి పిల్లలను దూరంగా ఉంచడం. పిల్లలు పెద్దలతో పోలిస్తే ఆహారం, పోషకాహారం విషయంలో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుందని మద్దతుదారులు అంటున్నారు. చిన్న వయసులోనే అనారోగ్యకరమైన ఆహారాల ప్రకటనలు ఎక్కువగా చూడటం వల్ల చెడు ఆహారపు అలవాట్లు ఏర్పడతాయని వారు అభిప్రాయపడుతున్నారు.

Also Read:Sankranthi:పట్నం నుంచి జనం పల్లె బాట!

నేషనల్ చైల్డ్ మెజర్‌మెంట్ ప్రోగ్రామ్ ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఇంగ్లండ్‌లో ప్రాథమిక పాఠశాల వయసు పిల్లల్లో స్థూలకాయం గత రెండు దశాబ్దాల్లో 17.5 శాతం నుంచి 22.1 శాతానికి పెరిగింది.

- Advertisement -