కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుకు వ్యతిరేకంగా తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ గురువారం వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ బిల్లు వల్ల తమిళనాడు రాజకీయ ప్రాతినిధ్యం తగ్గుతుందని ఆరోపిస్తూ, ఆయన బిల్లు ప్రతులను దహనం చేశారు.
మధురై ఈస్ట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంగా ఉదయనిధి నల్ల చొక్కా ధరించి తన నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “తమిళనాడులో ఎన్నికల హడావుడి ఉన్న సమయంలో, ప్రజల దృష్టిని మళ్లించి ఈ డీలిమిటేషన్ బిల్లును తీసుకురావాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. ఇది తమిళనాడు గళాన్ని బలహీనపరిచే కుట్ర” అని మండిపడ్డారు.
ఉదయనిధి స్టాలిన్ కంటే ముందే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బిల్లు ప్రతులను దహనం చేసి, నల్ల జెండాను ఎగురవేసి రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. డీఎంకే అధిష్టానం పిలుపు మేరకు తమిళనాడు అంతటా పార్టీ కార్యకర్తలు తమ ఇళ్లపై నల్ల జెండాలు ఎగురవేసి నిరసనలు తెలుపుతున్నారు.
కరూర్ జిల్లాలో మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ కూడా తన నివాసం వద్ద నల్ల జెండాను ఎగురవేసి, “తమిళనాడు పోరాడుతుంది.. తమిళనాడు గెలుస్తుంది” అంటూ నినాదాలు చేశారు.2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే, జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన తమిళనాడు వంటి రాష్ట్రాలకు లోక్‌సభలో సీట్ల సంఖ్య తగ్గే ప్రమాదం ఉందని డీఎంకే నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని వారు వాదిస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమాల్లో కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు మరియు ఇతర మిత్రపక్షాల నాయకులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Also Read:దక్షిణాదికి అన్యాయం జరగకూడదు:గుత్తా

