మహారాష్ట్రలో మూడు పార్టీల కూటమి కొలువు దీరేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేయడంతో.. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి తమకున్న సంఖ్యాబలంతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టాయి. సీఎంగా ఉద్ధవ్ థాకరే, ఉపముఖ్యమంత్రులుగా ఎన్సీపీకి చెందిన జయంత్ పాటిల్, కాంగ్రెస్ నేత బాలాసాహెబ్ థొరాట్ వ్యవహరించే అవకాశాలున్నాయని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
ఇప్పటికే ప్రోటెమ్ స్పీకర్ గా కాళిదాస్ కొలాంబ్కర్ ను నియమించడంతో ఇక ప్రభుత్వ ఏర్పాటు మాత్రమే మిగిలుంది. కొలాంబ్కర్ రేపు కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు. కాగా, డిసెంబరు 1న ఉద్ధవ్ థాకరే సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని, ముంబయిలోని శివాజీ పార్క్ మైదానంలో అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది.
శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ సంయుక్త సమావేశంలో తనను సీఎం అభ్యర్థిగా, మహావికాస్ అఘాడీ నేతగా ఎన్నుకున్న అనంతరం ఉద్ధవ్థాకరే మాట్లాడుతూ.. ఒకరిపై ఒకరికున్న నమ్మకం, విశ్వాసంతో తాము ఈ దేశానికి కొత్త మార్గనిర్దేశకత్వాన్ని చూపిస్తామని చెప్పారు. ప్రజలంతా తనకు అప్పజెప్పిన బాధ్యతలను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. నేను ఒంటరిని కాదు. మీరంతా నాతో ఉన్నారని ఉద్ధవ్ థాకరే అన్నారు. నిజమైన ప్రజాస్వామ్యం గెలిచిన రోజుగా అభివర్ణించారు.
తామంతా కలిసి రాష్ట్రంలో రైతుల కన్నీళ్లు తుడుస్తామని ఉద్ధవ్ థాకరే స్పష్టం చేశారు. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ లేవనెత్తిన ప్రతీ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు నేను సిద్ధంగా ఉన్నా. నేను ఎవరికీ భయపడను. అబద్దాలు హిందుత్వలో భాగం కాదు. మీరు అవసరమైనపుడు మమ్మల్ని కలుపుకుంటారు. అవసరం లేనపుడు దూరం పెడతారని బీజేపీపై ఉద్ధవ్ థాకరే మండిపడ్డారు. తాను రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తానని ఎప్పుడూ అనుకోలేదని అభ్యర్థి ఉద్ధవ్ థాకరే అన్నారు. ముఖ్యమంత్రిగా సేవలందించేందుకు తనకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఇతర నేతలకు ధన్యవాదాలు తెలిపారు.