తెలుగునాట బయోపిక్‌ల ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన చిత్రం ‘మహానటి’. ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో.. అదే బాటలో మరిన్ని బయోపిక్ చిత్రాలు తెరపైకి రావడానికి ముస్తాబవుతున్నాయి. వాటిలో.. ఒకప్పటి యువ సంచలనం ఉదయ్ కిరణ్ బయోపిక్ కూడా ఉందని తెలుస్తోంది. ‘చిత్రం’, నువ్వు నేను’, ‘మనసంతా నువ్వే’.. ఇలా కెరీర్ ఆరంభంలోనే హ్యాట్రిక్ విజయాలను చవి చూసి.. తెలుగు సినీ పరిశ్రమలో కథానాయకుడిగా సంచలనాన్ని సృష్టించారు యంగ్ హీరో ఉదయ్ కిరణ్.
తేజ స్కూల్ నుంచి వచ్చిన ఉదయ్ కిరణ్ తొలినాళ్లలో భారీ విజయాలు అందుకొని టాలీవుడ్‌లో తనదైన ముద్రవేసిన సంగతి విదితమే. ‘చిత్రం’ సినిమాతో వెండితెరకు ఉదయ్ కిరణ్‌ని హీరోగా పరిచయం చేసి.. ‘నువ్వునేను’ సినిమాతో అతన్ని స్టార్‌ను చేశాడు తేజ. ఉదయ్‌కిరణ్ సినిమా కెరీర్‌లో ఆయనది ముఖ్యపాత్ర. తేజ దర్శకత్వంలో ఉదయ్‌కిరణ్ మూడు సినిమాల్లో నటించారు. అతడి జీవితంలో మంచీచెడులు, ఎత్తుపల్లాలు, జయాపజయాలను తేజ దగ్గరి నుంచి చూశారు.
ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉండటంతో అతడి జీవితాన్ని వెండితెర మీదకి తీసుకురావాలని తేజ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పరాజయాల ఒత్తిడి తట్టుకోలేక ఉదయ్‌కిరణ్ 2014 జనవరిలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఉదయ్ కిరణ్ బయోపిక్‌ను తేజ ఎప్పుడు సెట్స్ పైకి తీసుకుని వెళ్తారో చూడాలి.