పిల్లల్లో టైప్-1 డయాబెటిస్‌పై వైద్యుల ఆందోళన

1
- Advertisement -

చిన్నారుల్లో టైప్-1 డయాబెటిస్ కేసులు గుర్తించేందుకు, వారికి సరైన చికిత్స అందించేందుకు సమాజవ్యాప్తంగా సహాయక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కేవలం వైద్యులు, ఆసుపత్రులపైనే ఈ బాధ్యతను వదిలేయకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థలు కూడా కీలక పాత్ర పోషించాలని అభిప్రాయపడ్డారు.

ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో హెచ్‌ఆర్‌ఐడీఏవై (HRIDAY) అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ‘బియాండ్ డయాగ్నసిస్: లివింగ్ వెల్ విత్ టైప్-1 డయాబెటిస్ ఎట్ హోమ్, ఇన్ స్కూల్స్ అండ్ కమ్యూనిటీస్’ పేరుతో కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఎండోక్రైనాలజిస్టులు, ప్రభుత్వ ప్రతినిధులు, బాధితులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

టైప్-1 డయాబెటిస్‌కు నాలుగు ప్రధాన లక్షణాలు

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవల సవరించిన రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (RBSK) 2.0 మార్గదర్శకాలు-2026లో 18 ఏళ్లలోపు పిల్లల్లో టైప్-1 డయాబెటిస్‌ను లక్షణాల ఆధారంగా గుర్తించడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో ‘4Ts’ పేరుతో నాలుగు హెచ్చరిక లక్షణాలను వివరించారు.

Toilet: తరచూ మూత్ర విసర్జనకు వెళ్లడం.

Thirsty: విపరీతంగా దాహం వేయడం.

Tired: అసాధారణంగా అలసటగా ఉండటం.

Thinner: కారణం లేకుండా బరువు తగ్గడం.

ఈ లక్షణాలు కనిపించిన పిల్లలకు రాండమ్ బ్లడ్ గ్లూకోజ్ పరీక్ష నిర్వహించి, అవసరమైతే జిల్లా ఆసుపత్రిలోని నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ క్లినిక్‌కు పంపించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

AIIMS ఎండోక్రైనాలజీ, మెటబాలిజం విభాగానికి చెందిన డాక్టర్ నిఖిల్ టాండన్ మాట్లాడుతూ.. టైప్-1 డయాబెటిస్‌ను ప్రారంభ దశలోనే గుర్తించడం చాలా ముఖ్యమని తెలిపారు. సకాలంలో గుర్తించకపోతే ప్రాణాపాయ పరిస్థితులకు దారితీయవచ్చని హెచ్చరించారు. ఇది ఆటో ఇమ్యూన్ వ్యాధి అని, శరీరంలో ఇన్సులిన్ తగినంతగా ఉత్పత్తి కాకపోవడం లేదా పూర్తిగా నిలిచిపోవడం వల్ల వస్తుందని వివరించారు. టైప్-2 డయాబెటిస్‌లా ఇది ప్రధానంగా జీవనశైలికి సంబంధించిన సమస్య కాదని స్పష్టం చేశారు.

టైప్-1 డయాబెటిస్ ఉన్న పిల్లలకు ఆసుపత్రుల్లోనే కాకుండా పాఠశాలల్లోనూ సరైన సంరక్షణ అందాలని నిపుణులు సూచించారు. ఇన్సులిన్ తీసుకోవడం, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను క్రమం తప్పకుండా పరీక్షించుకోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం, శారీరక వ్యాయామం చేయడం రోజువారీ జీవితంలో భాగం కావాలని తెలిపారు.

పిల్లలు పాఠశాలల్లోనే ఎక్కువ సమయం గడుపుతారని, అందువల్ల అక్కడ గ్లూకోజ్ పరీక్షలు చేసుకునేందుకు, ఇన్సులిన్‌ను భద్రపరిచేందుకు ఫ్రిజ్ వంటి సదుపాయాలు ఉండాలని సూచించారు. ఇతర పిల్లలతో సమానంగా తరగతులు, క్రీడల్లో పాల్గొనేలా ఎలాంటి వివక్ష లేకుండా చూడాలని కోరారు.

Also Read:Nvidia:జెన్సన్ హువాంగ్ రీ ఎంట్రీ..

- Advertisement -