భారత అండర్ -19 క్రికెట్ జట్టు అదరగొట్టింది. ఢాకా వేదికగా శ్రీలంకతో ఆదివారం జరిగిన ఫైనల్లో 144 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.భారత్ విధించిన 305 పరుగుల లక్ష్య ఛేదనలో చితికిలపడింది. 34.4 ఓవర్లో కేవలం160 పరుగులు మాత్రమే చేసి భారీ ఓటమిని మూటగట్టుకుంది.
ఫెర్నాండో (49), పరనవితన (48) మాత్రమే రాణించారు. భారీ లక్ష్యఛేదనలో ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించాల్సిన లంక్ బ్యాట్స్ మెన్ ఆరంభంలోనే తడబడ్డారు. భారత బౌలర్లను ఎదుర్కొనేందుకు ముప్పతిప్పలు పడ్డారు. 15 ఓవర్లలో లంక ఒక వికెట్ మాత్రమే కొల్పోయి 62 పరుగులు చేసింది. ఈ దశలో హర్ష్ త్యాగి విజృంభించడంతో లంక ఏ దశలోనూ కొలుకోలేకపోయింది. త్యాగి (6/38) ధాటికి విలవిల్లాడింది.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఆటగాళ్లు లంక బౌలర్లను ఉతికి ఆరేశారు. యశస్వి జైస్వాల్ (85; 113 బంతుల్లో 9×4, 1×6), సిమ్రాన్ సింగ్ (65; 37 బంతుల్లో 3×4, 4×6), అనుజ్ రావత్ (57; 79 బంతుల్లో 4×4, 3×6), ఆయుష్ బదోని (52 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 5×6) చెలరేగడంతో మొదట భారత్ 3 వికెట్లకు 304 పరుగులు చేసింది.