ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో తేడా వస్తే అంతే భయంకరంగా కూడా మారిపోతుంటుంది. ప్రకృతిలో భాగంగా మనుగడ కోసం ఒక జీవి మరోక జీవిపై ఆధారపడి బతకటం అనే సిద్దాంతం మాత్రం ఎప్పటికీ మారదు.అలాంటి సమయంలోనే రక్షణ కోసం కొన్ని జంతువులు గుంపులుగా బతకటం….దాడులకు దిగటం మనం అనేక సందర్భాల్లో చూశాం.
ఇటీవల ఓ ఏనుగు పిల్ల నీళ్లు తాగేందుకు తొండాన్ని నీటిలో చాచగానే అప్పటికే కాచుకుని ఉన్న మొసలి దానిని పట్టుకుంది. దీంతో ఆ గున్నేనుగు ఘీంకారం చేస్తూ వదిలించుకునే ప్రయత్నం చేసింది. అయితే, మొసలి ఎంతకు వదలకపోవడంతో దానిని పట్టుకుని ఒడ్డుకు లాక్కొచ్చేందుకు ప్రయత్నించింది. ఇంతలో మిగితా ఏనుగులు అరుస్తూ మొసలిని భయపెట్టి ఏనుగును విడిపించాయి. ఈ వీడియో ఎంత వైరలైందో తెలిసిందే.
తాజాగా మరో ఘటనలో రెండు సింహాలు కూడా మొసలి భారిన పడ్డాయి. బోట్స్‌వానాలోని వైల్డర్‌నెస్ సఫారీ కింగ్స్ పూల్‌లో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో అక్కడున్న టూరిస్టులు దీనిని వీడియో తీశారు. వివరాళ్లోకి వెళ్తే.. రెండు సింహాలు ఓ నదిని దాటుతున్నాయి. దాదాపుగా అవతలి ఒడ్డుకు చేరుకున్నాయి. ఇంతలో ఓ మొసలి మెరుపు వేగంతో వచ్చి ముందుగా వెళ్తున్న సింహంపై దాడి చేసింది. అయితే వెంటనే తేరుకున్న మరో సింహం ఆ మొసలిపై దాడి చేసి తన తమ్ముడు సింహాన్ని విడిపించింది. దాడితో బిత్తరపోయిన ఆ సింహం.. అదే షాక్‌లో వచ్చిన దారిలోనే మళ్లీ ఈదుకుంటూ వెనక్కి వచ్చేసింది. మరో సింహం కూడా బాగానే ఉన్నదని, అదే రోజు సాయంత్రం అది కూడా తిరిగి వచ్చేసిందని సఫారీ నిర్వాహకులు వెల్లడించారు. రెండు సింహాలు కలుసుకున్న తరువాత ఎలా ఉన్నాయో మీరు చూడండి..