జమ్ము ఎయిర్‌పోర్టులో ఈ రోజు తెల్లవారు జామున ఐదు నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు సంభవించాయి. దీంతో ఎయిర్‌పోర్టులోని ఓ భవనం పైకప్పు దెబ్బతింది. దీనిపై సమాచారం అందుకున్న బాంబు స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు ఎయిర్‌పోర్టు వద్దకు చేరుకుని తనిఖీలు చేస్తున్నాయి. అలాగే, స్థానిక పోలీసులతో కలిసి భద్రతా బలగాలు ఎయిర్ పోర్టు పరిసరాల్లో తనిఖీలు చేస్తున్నారు. జమ్ము విమానాశ్రయం రన్‌వే, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థ పూర్తిగా ఐఏఎఫ్ నియంత్రణలో ఉంటాయి. అందుకే ఈ ఐఏఎఫ్ అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు జరపుతున్నారు.
ఇది ఉగ్రవాదుల చర్యేనా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఎన్‌ఐఏ, ఎన్ఎస్‌జీ బలగాలు కూడా ఎయిర్‌పోర్టు వద్దకు వచ్చినట్లు తెలిసింది. ఎయిర్‌పోర్టులో పేలుళ్లపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించి, వైస్ ఎయిర్ చీఫ్ ఎయిర్ మార్షల్ హెచ్‌ఎస్ అరోరాతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఎయిర్ మార్షల్ విక్రమ్ సింగ్ ఎయిర్‌పోర్టు వద్దకు వెళ్లి అక్కడి పరిస్థితిని తెలుసుకోనున్నారు. ఇద్దరు భారత వైమానిక దళం సిబ్బందికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. దాడికి డ్రోన్లను వినియోగించినట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నారు అధికారులు.