వినోద్ కుమార్‌కు టీవీవీపీ వైద్యుల విజ్ఞప్తి..

223
vinod kumar
- Advertisement -

డీఎంఈ, ఆయుష్ వైద్యులకు పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచినట్లుగానే అవే అర్హతలు ఉన్న టీవీవీపీ వైద్యుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 65 సంవత్సరాలకు పెంచేందుకు సహకారాన్ని అందించాలనీ కోరుతూ తెలంగాణ వైద్య విధాన పరిషత్ ( టీవీవీపీ ) వైద్యులు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు మంగళవారం మంత్రుల అధికారిక నివాసంలో వినోద్ కుమార్ ను కలిసిన టీవీవీపీ వైద్యులు తమ సమస్యలను వివరించారు.డీఎంఈ, ఆయుష్ వైద్యులతో సమానంగా టీవీవీపీ వైద్యులు కూడా పీజీ వైద్య విద్యార్థులకు బోధిస్తున్నారని వారు తెలిపారు.ప్రపంచ బ్యాంకు నుంచి నిధులను పొందేందుకు 1986 లో అసెంబ్లీ తీర్మానం ద్వారా చట్టంలోని 29 వ అధికరణంతో ఏపీవీవీపీ ఏర్పడిందని వారు పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత టీవీవీపీగా మారిందని, ప్రస్తుతం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులతోనే టీవీవీపీ కార్యకలాపాలు సాగిస్తోందని ఆ వైద్యులు వెల్లడించారు.రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలు, ముఖ్య ప్రాంతాల్లో ఉన్న ఏరియా ఆసుపత్రిలలో టీవీవీపీ వైద్యులు విధులు నిర్వహిస్తున్నారని, కొవిడ్-19 వైద్యం కూడా చేస్తున్నారని వారు పేర్కొన్నారు.దీంతో పాటు ఎండీ, ఎం.ఎస్. తో సమానమైన పీజీ డిప్లొమా ఇన్ నేషనల్ బోర్డ్స్ ( డీ ఎన్ బీ ) విద్యార్థులకు టీవీవీపీ వైద్యులు బోధిస్తున్నారని వారు వినోద్ కుమార్ దృష్టికి తీసుకొచ్చారు.

డీఎంఈ, ఆయుష్ వైద్యులకు పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచినట్లుగానే అవే అర్హతలు ఉన్న టీవీవీపీ వైద్యుల పదవీ విరమణ వయస్సును కూడా 58 ఏళ్ల నుంచి 65 సంవత్సరాలకు పెంచాలని, ఈ విషయంలో సహకారాన్ని అందించాలనీ ఆ వైద్యులు వినోద్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు.

ఈ విషయంపై స్పందించిన బోయినపల్లి వినోద్ కుమార్ టీవీవీపీ వైద్యుల విజ్ఞప్తి న్యాయ సమ్మతంగానే ఉందన్నారు.ఈ మేరకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు మంగళవారం లేఖ రాశారు.అనుభవజ్ఞులైన టీవీవీపీ వైద్యుల సేవలను మరింత కాలం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వినోద్ కుమార్ అభిప్రాయ పడ్డారు.

- Advertisement -