నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘టక్ జగదీష్’ 2021లో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి. ‘నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేషన్‌లో అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
నాని 26వ చిత్రంగా రూపొందుతోన్న ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 23న ఈ సినిమా విడుదల కానున్నది. ఈ విషయాన్ని మంగళవారం విడుదల చేసిన టీజర్‌లో వెల్లడించారు. ఫిబ్రవరి 24 నాని బర్త్‌డే. దానికి ఒకరోజు ముందుగానే నాని అభిమానులకు సంబరాన్ని చేకూర్చేలా ‘టక్ జగదీష్’ టీజర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది.
1 నిమిషం 36 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్‌లో తన ఫ్యామిలీ అంటే విపరీతమైన ప్రేమాభిమానాలు చూపించే యువకుడిగానే కాకుండా రెస్పాన్సిబుల్ పర్సన్‌గానూ దర్శనమిచ్చాడు. “ఏటికొక్క పూటా.. యానాది పాటా” అంటూ బ్యాగ్రౌండ్ సాంగ్ వినిపిస్తుండగా చిత్రంలోని ఆసక్తికర సన్నివేశాలతో విలక్షణంగా ఈ టీజర్‌ను కట్ చేశారు. టక్ జగదీష్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో ఆ పాట మనకు చెబుతోంది. నాజర్ తండ్రిగానూ, జగపతిబాబు, నాని ఆయన కొడుకులుగానూ ఈ టీజర్ మనకు చూపించింది.
హీరోయిన్‌తో రొమాన్స్ చేస్తున్నప్పుడు పాటలో “చుట్టుముట్టుకుంటాడే చుట్టమల్లే కాపేసి” అనే లైన్ రావడం జగదీష్ ఎంత మంచోడో కూడా మనకు తెలుస్తుంది. అలాంటి మంచివాడి జీవితంలోకి డేనియల్ బాలాజీ అనే విలన్ వచ్చి ఇబ్బందులు వస్తే.. ఊరుకుంటాడా? జగదీష్ మంచివాడే కాదు.. రౌడీల భరతం పట్టే ధీరుడు కూడా. చెడు చేయడానికి వచ్చినవాళ్లను చితక్కొడుతూ మనకు కనిపించాడు జగదీష్. టీజర్ చివరలో కాళ్లకు పారాణి వేసుకొని, లుంగీ పైకి ఎగకట్టి వస్తున్న తీరుచూస్తే, పెళ్లికొడుకు అయినప్పుడు కూడా ఏదో సమస్యను ఎదుర్కోవడానికి వెళ్తున్నట్లుగా అనిపిస్తోంది. టైటిల్ రోల్‌లో నాని సూపర్బ్ అనిపిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన కోసమే ‘టక్ జగదీష్’ క్యారెక్టర్ పుట్టిందనిపిస్తోంది.
తమన్ సంగీతం, ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ ఈ టీజర్‌ను మళ్లీ మళ్లీ చూడాలనిపించేట్లు చేశాయి. డైరెక్టర్ శివ నిర్వాణ మరో సూపర్ హిట్ మూవీతో మనముందుకు వస్తున్నారనే గట్టి నమ్మకాన్ని ఈ టీజర్ ఇస్తోంది. థీమ్ సాంగ్స్‌లో తననెందుకు బెస్ట్ అంటారో తమన్ మరోసారి ఈ టీజర్‌లో వినిపించిన సాంగ్‌తో నిరూపించారు. సాహి సురేష్ ఆర్ట్ వర్క్ కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఫైట్ మాస్టర్ వెంకట్ సమకూర్చిన ఫైట్స్ ఈ సినిమాలోని మరో ఆకర్షణ.
తారాగణం:
నేచురల్ స్టార్ నాని, రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్, నాజర్, జగపతి బాబు, రావు రమేష్, నరేష్, డానియల్ బాలాజీ, తిరువీర్, రోహిణి, దేవదర్శిని, ప్రవీణ్.
సాంకేతిక బృందం:
రచన-దర్శకత్వం: శివ నిర్వాణ
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
సంగీతం: ఎస్. తమన్
సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
ఆర్ట్: సాహి సురేష్
ఫైట్స్: వెంకట్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్)
కో- డైరెక్టర్: లక్ష్మణ్ ముసులూరి
క్యాస్టూమ్ డిజైనర్: నీరజ కోన
పీఆర్వో: వంశీ-శేఖర్.