శశికళ వర్గం నేత టీటీవీ దినకరన్ ఆర్కేనగర్ ఉపఎన్నికలో భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, అధికార అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదనన్‌పై దాదాపు 40వేల మెజారిటీతో దినకరన్ అఖండ విజయాన్ని సాధించారు.
ప్రతిపక్ష డీఎంకే అభ్యర్థి మురుదు గణేష్ మూడో స్థానానికే పరిమితమయ్యారు. దివంగత జయలలిత నియోజకవర్గమైన ఆర్కే నగర్‌ను సొంతం చేసుకోవడంతో ఆమె రాజకీయ వారసుడిని తానేనంటూ దినకరన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉప ఎన్నికలో కుక్కర్ గుర్తుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన దినకరన్ మొదటినుంచి లీడ్‌లో కొనసాగుతూ.. ఇటు అధికార అన్నాడీఎంకే, అటు ప్రతిపక్ష డీఎంకే ఊహించనిస్థాయిలో భారీ విజయాన్ని అందుకున్నారు.
ఈ ఉపఎన్నికలో మొత్తం 18వ రౌండ్లు పూర్తయ్యేసరికి, దినకరన్ కు 86,472 ఓట్లు, అన్నా డీఎంకేకు 47,115, డీఎంకేకు 24,075 ఓట్లు లభించాయి. ఈ ఉప ఎన్నికలో ఒకే ఒక పోస్టల్ బ్యాలెట్ పోలైంది. కాగా, దినకరన్ విజయంతో ఆయన నివాసం వద్ద అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.