TTD: మూడో విడత ఇళ్ల పట్టాల పంపిణీ

12
- Advertisement -

ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా ఇంత తక్కువ వ్యవధిలో టీటీడీలో పనిచేస్తున్న 9,000 మందికి పైగా ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు ఇంటి స్థలాలు ఇవ్వడంతో తన జీవితం ధన్యమైందని, తన మనసు ఆనందంతో నిండి పోయిందని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకరరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తిరుపతి మహతి ఆడిటోరియంలో మంగళవారం జరిగిన మూడో విడత ఇళ్ల పట్టాల పంపిణీ పండుగ కార్యక్రమంలో ఛైర్మన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టీటీడీ ఛైర్మన్, ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి కలిసి 4 వేల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఇంటిస్థలం ప్రొసీడింగ్స్ అందజేశారు.

ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ 16 ఏళ్ల క్రితం తాను టీటీడీ ఛైర్మన్ గా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ఆదేశాలతో టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రయత్నించామని చెప్పారు. తన పదవీకాలం ముగిసిన తర్వాత వచ్చిన అడ్డంకుల కారణంగా ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయింపు నిలిచిపోయిందని, ఆ బాధ ఇప్పటికీ తన మెదడును తొలుస్తోందని చెప్పారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి కరుణ, ముఖ్యమంత్రివర్యులు  వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో రెండోసారి తనకు టీటీడీ ఛైర్మన్ గా అవకాశం వచ్చిందని, ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకే స్వామివారు తన భుజం తట్టినట్టుగా భావిస్తున్నానని అన్నారు. సర్వీసులో ఉన్న ఉద్యోగులతో పాటు విశ్రాంత ఉద్యోగులందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాలని సంకల్పం చేసుకున్నానన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్లగానే వెంటనే అంగీకరించారని చెప్పారు.

వడమాలపేట, పాదిరేడు అరణ్యం వద్ద రెండు విడతల్లో 432 ఎకరాల్లో 5,221 మంది ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయించామన్నారు. ప్రస్తుతం ఏర్పేడు మండలం పల్లం వద్ద ఉద్యోగులకు, సర్వీస్ పెన్షనర్లకు, ఫ్యామిలీ పెన్షనర్లకు కలిపి 4000 మంది ఇంటి స్థలాలు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బాధ్యతాయుమైన ప్రభుత్వం ఉండబట్టే టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాల కేటాయింపు జరిగిందన్నారు. ఇంకా మిగిలిపోయిన ఉద్యోగులు, పెన్షనర్లకు అందరికీ తప్పకుండా ఇంటి స్థలాలు కేటాయిస్తామని తెలియజేశారు. అదేవిధంగా టీటీడీలోని కార్పొరేషన్, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, ఎఫ్ఎంఎస్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులందరికీ రు.5 వేల నుండి రూ.20 వేల వరకు వేతనాలు పెంచినట్లు తెలియజేశారు. ఇలాంటి మంచి పనులు చేపట్టేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న టీటీడీ ఈవో  ఏవి.ధర్మారెడ్డికి, జేఈవో   వీరబ్రహ్మంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Also Read:నల్లవెల్లుల్లితో ఎన్ని ప్రయోజనాలో..!

- Advertisement -