తిరుపతి శ్రీవాణి ట్రస్టు ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 11 ఆలయాల నిర్మాణానికి రూ.8.48 కోట్లు మంజూరుకు టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి ఆమోదముద్ర వేశారు. ఈ ట్రస్టు ద్వారా చేపట్టే 50 ఆలయాలు, 84 ఆలయాల జీర్ణోద్ధరణ, పునర్నిర్మాణం, 42 భజన మందిరాల పనులను వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని ఈవో అధికారులను ఆదేశించారు. టిటిడి పరిపాలనా భవనంలోని తన కార్యాలయంలో శనివారం ఆయన శ్రీవాణి ట్రస్టుపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. శ్రీవాణి ట్రస్టు, దేవాదాయ శాఖ సిజిఎఫ్ ద్వారా మంజూరు చేసే ఆలయాల నిర్మాణాలకు సంబంధించిన మాస్టర్ డేటాబేస్డ్ సిస్టమ్ తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి కాలనీల్లో ఆలయాల నిర్మాణం కోసం అందిన 1100 దరఖాస్తులను దేవాదాయ శాఖ పరిశీలనకు పంపామని, పరిశీలన పూర్తి కాగానే ఆలయాల నిర్మాణపనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఈవో అన్నారు.
వెనుకబడిన ప్రాంతాల్లో సనాతన హిందూ ధర్మాన్ని మరింత వ్యాప్తి చేయడంలో భాగంగా పురాతన ఆలయాల పునర్నిర్మాణం, ఆలయాలు లేనిచోట ఆలయాల నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నారు. దీనివల్ల ప్రజలను ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించేందుకు అవకాశం లభిస్తుందని ఈవో అభిప్రాయపడ్డారు. దేవాదాయ శాఖ కమిషనర్‌తో చర్చించి శ్రీవాణి ట్రస్టు ద్వారా నిధులు మంజూరు చేసిన ఆలయాల నిర్మాణం, పునర్నిర్మాణం, జీర్ణోద్ధరణ పనులు సకాలంలో పూర్తి చేయించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆలయాల నిర్మాణానికి సంబంధించి వచ్చిన దరఖాస్తులపై సమీక్షించారు. తదుపరి చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.