తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు శుక్రవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి.
రాత్రి 9 గంటలకు ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. గజ పటాన్ని అవనతం చేసి ధ్వజారోహణం నాడు ఆహ్వానించిన సకల దేవతలను సాగనంపారు.
బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకునే వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారని ఐతిహ్యం . విషమృత్యు నాశనం, రాజ్యపదవులవంటి సకల శ్రేయస్సులు పొందుతారని విశ్వాసం .
పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం పంచమీ తీర్థం(చక్రస్నానం) అశేష భక్తజనవాహిని మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. పద్మ పుష్కరిణిలో స్నానం ఆచరించిన భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు.
ఉదయం 7 నుండి 8 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు పల్లకిలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. అనంతరం అమ్మవారికి ఆస్థానం నిర్వహించి ఉత్సవర్లను ఊరేగింపుగా పంచమీ తీర్థ మండపానికి వేంచేపు చేశారు.
శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం సందర్బంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారు కానుకలు పంపారు. రూ.1.11 కోట్ల విలువ చేసే 3 కేజీల బరువు గల బంగారు పాండియన్ కిరీటం, డైమండ్ నక్లెస్, రెండు డైమండ్ గాజులు, డైమండ్ కమ్మల జత, బంగారు గజలక్ష్మి పథకం సారెతో పాటు తిరుపతి పురవీధులలో ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించారు.
Also Read:ఎన్టీఆర్..మనదేశంకు 70 ఏళ్లు