తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో మూడో రోజైన మంగళవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు తెప్పపై విహరించారు. ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. స్వామి, అమ్మవార్లు మూడుసార్లు విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాలు, వేదపండితుల వేదపారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది.
సంగీత, సాహిత్య రంగాల్లో అపారమైన జ్ఞానం ఉన్న రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ బహుముఖ ప్రజ్ఞాశాలి అని శత అవధాని శ్రీ ఆముదాల మురళి కొనియాడారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు, హిందూ ధార్మిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ 46వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా శ్రీ ఆముదాల మురళి మాట్లాడుతూ, శ్రీ రాళ్లపల్లి వారికి సంగీతం, సాహిత్యం రెండు కళ్లు లాంటివని,శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనలను రాగి రేకుల నుండి పరిష్కరించి గ్రంథస్తం చేయడంతోపాటు వందల కృతులను స్వరపరిచారని తెలిపారు. రాగి రేకుల్లో పేర్కొన్న రాగాలతోనే స్వరపరిచారని, ఈ రాగాలు ప్రస్తుతం లేకపోయినా అన్నమయ్య కాలం నాటి సమకాలీన సంగీతాన్ని దృష్టిలో ఉంచుకుని బాణీలు కూర్చారని చెప్పారు.పాండురంగ మహత్యం, రంగనాథ రామాయణం మొదలగు గ్రంథాలలో ఇదివరకు ప్రచురణకర్తలు పొరపాటుగా ముద్రించిన పద్యాలను సరి చేశారని వివరించారు.
జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం తెలుగు అధ్యాపకులు డాక్టర్ లక్ష్మీనారాయణ “శ్రీరాళ్లపల్లి వారి విమర్శ సాహిత్యం ” అనే అంశంపై మాట్లాడుతూ, సారస్వత లోకం, నాటక లోకం అన్న గ్రంథాలలో రాళ్లపల్లి వారు అనేక వ్యాసాలను రచించినట్లు తెలిపారు అందులో నిగమ శర్మ – అక్క, రాయలనాటి రసికత, వేమన మొదలగు ఎన్నో వ్యాసాలు నీటికి విద్యార్థులకు పాఠ్యాంశాలుగా ఉన్నట్లు చెప్పారు. కట్టమంచి రామలింగారెడ్డి స్నేహంతో వారు ప్రాచీన ఆధునిక, విమర్శ పదాలను మేలవించారని తెలిపారు.శ్రీ రాళ్లపల్లి వారికి ఎక్కువ భాషలు తెలిసి ఉండడం, రాయలసీమ వ్యక్తి కావడం, వైష్ణవతత్వంపై అవగాహన ఉండడంతో అన్నమయ్య రాగిరేకుల్లోని కీర్తనలను ఎంతో ప్రామాణికంగా వెలుగులోకి తీసుకొచ్చారని తెలియజేశారు.
Also Read:గద్దర్ సినీ అవార్డులు.. ఎంట్రీల ఆహ్వానం

