TTD:వైభ‌వంగా కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు

12
- Advertisement -

తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని టీటీడీ జేఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని  కోదండరామస్వామి ఆలయంలో బుధ‌వారం రాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అన్ని విభాగాధిపతులతో జేఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జేఈవో శ్రీ వీరబ్రహ్మం మాట్లాడుతూ, ఏప్రిల్ 4న అంకురార్ప‌ణ‌తో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు ఏప్రిల్ 5న ధ్వజారోహణం, ఏప్రిల్ 9న గ‌రుడ సేవ , ఉగాది పండుగ వస్తున్నందున భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉందన్నారు . ఏప్రిల్ 10న హ‌నుమంత వాహ‌నం, ఏప్రిల్ 13వ తేదీన చక్రస్నానంతో. బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయని తెలిపారు. వాహన సేవలు ప్రతి రోజు ఉదయం 8 నుండి 10గంటలవరకు , రాత్రి 7 నుండి 9 గంటల వరకు నిర్వహిస్తారన్నారు . అలాగే ఏప్రిల్ 17 నుండి 19వ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలు, ఏప్రిల్ 21 నుంచి 23వ తేదీ తెప్పోత్సవాలు జరుగనున్నాయని వివరించారు.

ఆల‌యంలో ఆక‌ట్టుకునేలా పెయింటింగ్స్‌, రంగ‌వ‌ల్లులు తీర్చ‌దిద్దాల‌ని సూచించారు. రథోత్సవం కోసం రథాన్ని, వాహ‌న సేవల కోసం వాహనాలు ,తండ్ల‌ పటిష్టతను ముంద‌స్తుగా త‌నిఖీ చేయాల‌న్నారు. బ్రహ్మోత్సవాల్లో స్వామివారి వాహనసేవల ముందు భక్తులను ఆకట్టుకునేలా భజనలు, కోలాటాలు, ఇతర కళాబృందాల ప్రదర్శనలు ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. బ్రహ్మోత్సవాల శోభను తెలిపేరీతిలో ఆలయ పరిసర ప్రాంతాలలో విద్యుత్ అలంక‌ర‌ణ‌లు, పుష్పాలంకరణలు ఏర్పాటు చేయాలన్నారు.

భ‌క్తుల కోసం ప్ర‌థ‌మ చికిత్స కేంద్రాలు ఏర్పాటుచేయాల‌న్నారు . ఎస్వీబీసీ ద్వారా వాహ‌న‌సేవ‌ల‌ను ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం చేయాల‌ని జేఈవో ఆదేశించారు. వాహన సేవకు సంబంధించిన వ్యాఖ్యానం చేసేందుకు వ్యాఖ్యాతలను ఎంపిక చేసుకోవాలన్నారు. భ‌క్తుల‌కు సేవ‌లందించేందుకు త‌గినంత మంది శ్రీ‌వారి సేవ‌కుల‌ను ర‌ప్పించాల‌న్నారు. భక్తులు రామకోటి రాసేందుకు వీలుగా పుస్త‌కాలు అందించాలన్నారు. భ‌క్తుల ర‌ద్దీని క్ర‌మ‌బ‌ద్ధీక‌రించేందుకు బారీకేడ్లు ఏర్పాటుచేయాల‌ని ఆదేశించారు. స్థానిక పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని జేఈవో ఆదేశించారు. భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేయాలని, తాగునీరు, మజ్జిగ అందుబాటులో ఉంచాలని, మెరుగైన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

Also Read:ట్రెండింగ్‌లో జరగండి సాంగ్..

- Advertisement -