తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను తలపించేలా మన తిరుపతి 894వ ఆవిర్భావ వేడుకలను టీటీడీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలో శనివారం ఉదయం ఛైర్మన్ ఈ ఉత్సవాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ, జగద్గురువు శ్రీశ్రీశ్రీ రామానుజాచార్యులు తన అమృత హస్తాలతో 24.02.1130 న శంకుస్థాపన చేయడంతో పాటు గోవిందరాజపురంగా నామకరణ చేయగా, నేడు తిరుపతిగా భాసిల్లుతున్నదన్నారు. ఇక నుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 24న సాంప్రదాయంగా, ఆచారంగా తిరుపతి పుట్టిన రోజు వేడుకను టీటీడీ క్యాలెండర్ లో భాగం చేస్తూ, పాలక మండలిలో తీర్మానించనున్నట్లు ఛైర్మన్ తెలిపారు. తిరుమల శ్రీవారి ఆశీస్సులతోనే ఈ పండుగను ఇంత అద్భుతంగా నిర్వహించుకుంటున్నట్లు చెప్పారు.
ఇందులో వేద పండితుల వేద ఘోష, కళాకారుల అద్భుత విన్యాసాలతో తిరుపతిలో కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతాయనేలా మైమరిపించారన్నారు. టీటీడీ యంత్రాంగమంతా కదలివచ్చి మన తిరుపతి పుణ్యక్షేత్ర ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా నభూతో న భవిష్యత్ అనేలా నిర్వహించిందన్నారు. ఈ కార్యక్రమ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. తిరుపతి నగరం ప్రపంచానికి ఓ ఆదర్శ నగరం కావాలని ఆకాంక్షించారు.
అనంతరం టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి మాట్లాడుతూ, ప్రపంచ నలుమూలల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుపతి మీదుగా తిరుమలకు వెళ్తారన్నారు. కావున భక్తులకు మరింత ఆధ్యాత్మిక ఆనందన్ని కలిగించేందుకు తిరుపతి నగరాన్ని కూడా తిరుమల తరహాలో సుందరంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.
అంతకుముందు ఛైర్మన్ శ్రీగోవిందరాజ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, శోభాయాత్రను ప్రారంభించారు. టీటీడీ డిపిపి, అన్నమాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టుకు చెందిన వందలాది మంది కళాకారులు చెక్క భజనలు, కోలాటాలతో లయబద్ధంగా ఆడుతూ, గోవింద నామ సంకీర్తనలు, వేదపండితులు మంత్రోచ్చారణల మధ్య భక్తి చైతన్య యాత్ర జరిగింది. అదేవిధంగా కళాకారుల వివిధ దేవతామూర్తుల, పౌరాణిక వేషధారణలు పురప్రజలను విశేషంగా ఆకర్షించాయి.
Also Read:‘కారు జోరు’ గ్యారంటీ !