TTD:వేసవి రద్దీ నేపథ్యంలో ముందస్తు చర్యలు

20
- Advertisement -

 తిరుమల శ్రీవారి దర్శనార్థం వేసవిలో విచ్చేసే లక్షలాదిమంది భక్తులకు ఎలాంటి అసౌక‌ర్యాం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం సాయంత్రం జూలై వరకు కొనసాగనున్న వేసవి సెలవుల యాత్రికుల రద్దీకి సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఈవో సమీక్షించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, మొదటి ఘాట్‌ రోడ్డులోని అక్కగార్ల గుడి, శ్రీవారి సేవా సదన్‌, తిరుమలలో భ‌క్తుల ర‌ద్ధీ అధికంగా ఉండే ప్రాంతాల్లో చ‌లువ పెయింట్‌ వేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వేసవిలో యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విద్యుత్ సరఫరా నిరంత‌రాయంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. యాత్రికుల అవసరాలను తీర్చడానికి తగినంత లడ్డూల బఫర్ స్టాక్‌ను ఉంచాలని ఆలయ అధికారులకు సూచించారు. యాత్రికుల కోసం ఒఆర్ఎస్ ప్యాకెట్ల‌లను తగినంత నిల్వ ఉంచాలని వైద్య అధికారులను ఆదేశించారు. రాబోవు వేసవిలో తిరుమలలోని అన్ని ప్రాంతాలలో భక్తులకు అవసరమైన నీటి సరఫరాచేసేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

మార్చి 25వ తేదీన తిరుమలలో జరుగనున్న శ్రీ తుంబురు తీర్థ ముక్కోటికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల నుండి విశేషంగా భ‌క్తులు విచ్చేసే అవ‌కాశ‌ముంద‌ని, ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు చేయాల‌ని ఈవో అధికారుల‌ను ఆదేశించారు. 60 ఏళ్లలోపు వయస్సు ఉన్న యాత్రికులు, శారీరకంగా దృఢంగా ఉన్న యాత్రికులు మాత్రమే ఈ మార్గంలో ట్రెక్కింగ్‌కు అనుమతించనున్న‌ట్లు విస్తృతంగా ప్రచారం చేయాల‌న్నారు. అలాగే, ఊబకాయం, గుండె జబ్బులు, ఉబ్బసం, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న యాత్రికులు వారి ఆరోగ్య భద్రత దృష్ట్యా అనుమతించబడరు అని చెప్పారు.

Also Read:ముల్తానీ మట్టి మొఖానికి మంచిదేనా?

- Advertisement -