సమాజంలోని కుల వివక్షను 600 సంవత్సరాల క్రితమే వ్యతిరేకించి పోరాడిన గొప్ప సంఘసంస్కర్త, వేంకటేశ్వర స్వామి వైభవాన్ని తన సంకీర్తనల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేసిన శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యుల సంగీతామృతాన్ని మరింతగా జనబాహుళ్యం లోకి తీసుకుని వెళతామని టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు.
మహతి ఆడిటోరియంలో బుధవారం తిరుమల- తిరుపతి దేవస్థానముల ధార్మిక ప్రాజెక్టులు, శాంతా వసంతా ట్రస్ట్ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో ముద్రించిన” శ్రీ వేంకటేశ పదములు” పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరైన శ్రీ భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ, సామాజిక దాష్టీకాలపై పోరాడిన వ్యక్తి, శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తిని సరళమైన భాషలో ప్రజలకు అందించిన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 600 జయంతి ఉత్సవాలను గతంలో తాను చైర్మన్ గా ఉండగా తాళ్లపాక గ్రామంలో అత్యద్భుతంగా జరిపామని చెప్పారు. 108 అడుగుల అన్నమయ్య విగ్రహాన్ని కూడా ఆవిష్కరించామన్నారు. అన్నమాచార్యులు రచించిన 32 వేల సంకీర్తనల్లో 12వేలు మాత్రమే లభించాయన్నారు. వీటిని మరింతగా జన బాహుళ్యంలోకి తీసుకుని వెళ్ళాల్సిన అవసరం ఉందన్నారు.
టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు రాబోయే రోజుల్లో ఈ దిశగా మరింత బాధ్యతగా పని చేస్తుందని శ్రీ కరుణాకరరెడ్డి చెప్పారు. నిరంతరం సామాజిక, ఆధ్యాత్మిక సేవలో తలమునకలై ఉండే డాక్టర్ వరప్రసాద్ రెడ్డి అన్నమయ్య సంకీర్తనలను పరిష్కరించి పుస్తక రూపంలో ప్రజల్లోకి తీసుకుని వెళ్లడం అభినందనీయమన్నారు. ఆయన కు స్ఫూర్తినిచ్చిన జర్మన్ రచయిత స్టీఫన్ త్సయిక్ రచించిన “విరాట్” పుస్తకాన్ని తాను కూడా అనేకమార్లు చదివానన్నారు. విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే ఈ పుస్తకాన్ని 25 వేల కాపీలు తెలుగులో ముద్రించి ఉచితంగా అందిస్తానని ఆయన ప్రకటించారు.
Also Read:ఓటీటీలో దూసుకెళ్తున్న..’ఓ సాథియా’
టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి మాట్లాడుతూ, అన్నమయ్య సంకీర్తనలు చదివి అర్థం చేసుకుంటే వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలన్నీ అర్ధమైనట్లేనన్నారు. అన్నమయ్య వీటన్నింటిని అవపోసన పట్టి సరళమైన భాషలో సంకీర్తనల రూపంలో అందించారని తెలిపారు. 600 ఏళ్ల క్రితమే సామాజిక వివక్షపై ఆయన పోరాడారని తెలిపారు. ఆనాటి కాలంలోని భాష ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ అర్థం చేసుకునే అవకాశం లేదని చెప్పారు. అందుకే అన్నమాచార్యుల సంకీర్తనలకు అర్థం, ప్రతి పదార్థం ఇతర విశేషాల ను వివరిస్తూ అందరికీ అర్థమయ్యేలా పుస్తక రూపంలో తేవడానికి ప్రత్యేకంగా ప్రాజెక్టు ఏర్పాటు చేశామన్నారు.
Also Read:రేవంత్ vs రాహుల్ గాంధీ.. హస్తంలో నయా లొల్లి!