శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు సోమవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. అంకురార్పణం సందర్భంగా సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం నిర్వహించారు.
బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు టిటిడి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టింది. వాహనసేవల సమయంలో భక్తులకు అన్న ప్రసాదాలు, మజ్జిగ, పాలు, తాగునీరు అందించనున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు ఉదయం నుండి రాత్రి వరకు భక్తులకు అందుబాటులో ఉంచారు. భక్తులకు వైద్యసేవలు అందించేందుకు వైద్యశిబిరం ఏర్పాటుచేశారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి ఆలయం, పరిసర ప్రాంతాల్లో భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్, పుష్పాలంకరణలు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల్లో 9 రోజుల పాటు అలంకరణకు సంబంధించి మొత్తం 3 టన్నుల పుష్పాలను వినియోగించనున్నారు. ఇందులో సంప్రదాయ పుష్పాలతో పాటు విదేశీజాతుల పుష్పాలు కూడా ఉన్నాయి. వాహనసేవల్లో స్వామి, అమ్మవార్లను విశేషంగా అలంకరించనున్నారు. దేవతామూర్తుల విద్యుత్ కటౌట్లు ఆకట్టుకుంటున్నాయి.
ఫిబ్రవరి 18వ తేదీ ధ్వజారోహణంతో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 6 నుండి 7 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు తిరుచ్చి ఉత్సవం జరుగనుంది. ఉదయం 8.15 నుండి 8.40 గంటల మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ, రాత్రి 7 నుండి 8 గంటల వరకు పెద్దశేష వాహనసేవ జరుగనున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
18-02-2025
ఉదయం – ధ్వజారోహణం (మీనలగ్నం)
రాత్రి – పెద్దశేష వాహనం
19-02-2025
ఉదయం – చిన్నశేష వాహనం
రాత్రి – హంస వాహనం
20-02-2025
ఉదయం – సింహ వాహనం
రాత్రి – ముత్యపుపందిరి వాహనం
21-02-2025
ఉదయం – కల్పవృక్ష వాహనం
రాత్రి – సర్వభూపాల వాహనం
22-02-2025
ఉదయం – పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం)
రాత్రి – గరుడ వాహనం
23-02-2025
ఉదయం – హనుమంత వాహనం
సాయంత్రం – స్వర్ణరథం,
రాత్రి – గజ వాహనం
24-02-2025
ఉదయం – సూర్యప్రభ వాహనం
రాత్రి – చంద్రప్రభ వాహనం
25-02-2025
ఉదయం – రథోత్సవం
రాత్రి – అశ్వవాహనం
26-02-2025
ఉదయం – చక్రస్నానం
రాత్రి – ధ్వజావరోహణం