తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు శుభవార్త తెలిపింది. తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించిన ఏప్రిల్ నెల ఆర్జిత సేవా టికెట్ల కోటాను విడుదల చేసింది. ఇందులో సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ సేవలకు సంబంధించిన టికెట్లు ఉన్నాయి. ఈ టికెట్లను ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకునే అవకాశం కల్పించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
భక్తులు ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ ఆర్జిత సేవా టికెట్లను బుక్ చేసుకోవచ్చని వెల్లడించారు. లక్కీ డ్రా ద్వారా టికెట్లు పొందిన భక్తులు, ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు తప్పనిసరిగా డబ్బులు చెల్లించి టికెట్లను కన్ఫర్మ్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. నిర్ణీత సమయంలో చెల్లింపు చేయని పక్షంలో టికెట్లు ఆటోమేటిక్‌గా రద్దు అవుతాయని స్పష్టం చేసింది.
అదేవిధంగా, ఈ నెల 22వ తేదీన కల్యాణోత్సవం, ఇతర ఆర్జిత సేవా టికెట్ల కోటాను విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. 23వ తేదీన అంగప్రదిక్షణ సేవతో పాటు శ్రీవాణి ట్రస్ట్ సేవా టికెట్ల కోటాను అందుబాటులోకి తీసుకురానుంది. ఇక 24వ తేదీన భక్తులకు మరింత సౌకర్యంగా ఉండేందుకు గదుల కోటాతో పాటు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కూడా విడుదల చేయనున్నారు.
భక్తులు అధికారిక టీటీడీ వెబ్‌సైట్ ద్వారానే టికెట్లు బుక్ చేసుకోవాలని, మధ్యవర్తులను ఆశ్రయించవద్దని టీటీడీ మరోసారి హెచ్చరించింది. తిరుమల యాత్రను సక్రమంగా ప్రణాళిక చేసుకునేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది.
Also Read:బండ్ల గణేష్..అందరివాడు!

