అయోధ్యలోని శ్రీ రామాలయ నిర్వహణ, యాత్రికులకు కల్పించవలసిన సౌకర్యాలు తదితర అంశాలపై శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు విజ్ఞాపన మేరకు టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తో కూడిన ఇంజనీరింగ్ అధికారుల బృందం సాంకేతిక సలహాలతో కూడిన నివేదికను ట్రాస్టుకు అందజేశారు.
శనివారం అయోధ్య రామాలయాన్ని ఈవో, టీటీడీ అధికారుల బృందంతో సందర్శించారు. తిరుమల తరహాలో అయోధ్య రామాలయంలో కూడా దేశవ్యాప్తంగా ప్రతి రోజు వేలాదిగా విచ్చేసే భక్తులకు విశేష సేవలు అందించేందుకు అవసరమైన సాంకేతిక సలహాలను టీటీడీని అందించవలసిందిగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోరిన విషయం విదితమే.
ఇదే అంశంపై టీటీడీ అధికారుల బృందం ఫిబ్రవరి 16, 17వ తేదీల్లో అయోధ్యలో క్షేత్ర పరిశీలన జరిపారు.కాగా శనివారం సాయంత్రం టీటీడీ అధికారులతో క్షేత్ర ట్రస్ట్ నిర్వాహకులు సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అధిక రద్దీ సమయాల్లో ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్యూలైన్ల నిర్వహణ, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, భక్తులకు తాగునీటి కుళాయిల ఏర్పాటు, తదితర అంశాలతో పాటు ఆలయ నిర్వహణపై టీటీడీ అధికారుల బృందం సాంకేతిక సలహాలతో కూడిన సమగ్ర నివేదికను అందించింది.అనంతరం ఈవో, టీటీడీ అధికారుల బృందం అయోధ్య శ్రీ రాములవారిని దర్శించుకున్నారు.
Also Read:KCR:రంజిత్ రెడ్డికి బుద్ది చెప్పండి