ఎండా కాలంలో నిరంతర విద్యుత్- సీఎండీ రఘుమా రెడ్డి

292
Raghuma Reddy
- Advertisement -

ఈ ఎండా కాలంలో గ్రేటర్ హైదరాబాద్‌లో, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ పరిధిలోని జిల్లాల్లో నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా చూడాలని సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్లను, సూపెరింటెండింగ్ ఇంజినీర్లను సంస్థ చైర్మన్ అండ్‌ మేనేజింగ్ డైరెక్టర్ జి రఘుమా రెడ్డి ఆదేశించారు. ఈ రోజు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో, జోనల్ మరియు సర్కిల్ అధికారులు రూపొందించిన ప్రత్యేక కార్యాచరణను సంస్థ డైరెక్టర్ ఆపరేషన్స్ జే శ్రీనివాస రెడ్డి, చీఫ్ జనరల్ మేనేజర్ల, సూపెరింటెండింగ్ ఇంజినీర్లతో చర్చించారు.

సీఎండీ మాట్లాడుతూ, ఎండా కాలంలో ఏర్పడే అదనపు లోడ్లు తట్టుకునేందుకు గాను, 56 పవర్ ట్రాన్స్ ఫార్మర్లు, 1725 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు మరియు 11 నూతన 33/11 కేవీ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. దీనికి తోడు వివిధ నిర్వహణ పనులైన 75 నూతన 33 కేవీ ఫీడర్లు తరలింపు, 24 నెం 33 కేవీ ఫీడర్ల ఇంటెర్లింకింగ్, బ్రేకర్ల మరమత్తు, లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తీసివేత, 33/11 కేవీ సబ్ స్టేషన్ల నిర్వహణ, ట్రాన్స్ ఫార్మర్ల లోడ్ బ్యాలెన్సింగ్ వంటి పనులు పూర్తీ చేయడం జరిగిందని సీఎండీ తెలిపారు.

విద్యుత్ ట్రాన్సఫార్మర్ల, 33 ఫీడర్ల పని తీరుపై నిరంతర పర్యవేక్షణ గావించాలి, సరఫరాలో అంతరాయాలు, అత్యవసర పరిస్థితులు ఎదుర్కొనేందుకు 2% ట్రాన్స్ ఫార్మర్ల రోలింగ్ స్టాక్, మొబైల్ ట్రాన్సఫార్మర్లు, మంటలు ఆర్పే పరికరం వంటివి సమకూర్చుకోవాలని క్షేత్ర స్థాయి సిబ్బందిని సీఎండీ ఆదేశించారు. ఈ వేసవి కాలం ముగిసే వరకు పీక్ సమయాల్లో సూపెరింటెండింగ్ ఇంజినీర్ల నుండి అసిస్టెంట్ ఇంజినీర్ల వరకు తమ తమ పరిధిలోని సబ్ స్టేషన్లలో రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉండాలి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటి డిమాండ్‌తో పోల్చుకుంటే ప్రస్తుతం విద్యుత్ వినియోగం బాగా పెరిగింది. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల విద్యుత్ వాడకం పెరగడం, వినియోగదారుల జీవన శైలిలో మార్పులు ఈ డిమాండు పెరగటానికి దోహద పడుతున్నాయని సీఎండీ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్లో జూన్ 2, 2014 న విద్యుత్ వాడకం 49.56 మిలియన్ యూనిట్లు ఉండగా, అది ప్రస్తుతం మే 29, 2019 లో 73.84 మిలియన్ యూనిట్లకు చేరింది. సంస్థ పరిధిలో ఏప్రిల్ 03, 2014న విద్యుత్ వాడకం 119.6 మిలియన్ యూనిట్లు ఉండగా అది మార్చ్ 26, 2021 కి 180.5 మిలియన్ యూనిట్లకు చేరింది. ఈ సీజన్లో గ్రేటర్ హైదరాబాద్ నగరంలో విద్యుత్ వాడకం 80 మిలియన్ యూనిట్లకు మించిద్దని, సంస్థ పరిధిలో 185 మిలియన్ యూనిట్లకు పైగా విద్యుత్ వాడకం నమోదయ్యే అవకాశం వున్నదని సీఎండీ తెలిపారు.

సంస్థ పరిధిలోని అన్ని రంగాల వారికీ నిరంతర విద్యుత్ సరఫరా వుండే విధంగా చర్యలు తీసుకున్నామని, ఒక వేళ వినియోగదారులకు సరఫరాలో ఎలాంటి అంతరాయాలు వున్నా 1912/100, సంస్థ వెబ్ సైట్, సంస్థ మొబైల్ ఆప్, ట్విట్టర్, పేస్ బుక్ ల ద్వారా తమకు తెలియజేసి విద్యుత్ సరఫరా పొందగలరని సీఎండీ తెలిపారు.

- Advertisement -