గ్రేటర్‌లో ఇకపై 24 గంటలు బస్సులో ప్రయాణించవచ్చు. ప్రయాణికుల డిమాండ్, రద్దీ ఉన్న రూట్లలో అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారు జామున 4 గంటల వరకు ఆర్టీసీ బస్సులు ఇకపై అందుబాటులో ఉండనున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఆలస్యంగా నగరానికి చేరుకొనే ప్రయాణికులు, తెల్లవారు జామునే దూరప్రాంతాలకు బయలుదేరేవారికి ఈ బస్సులు అనుకూలంగా ఉండనున్నాయి.
సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఆఫ్జల్‌గంజ్, మెహదీపట్నం, బోరబండ, తదితర ప్రాంతాలకు కూడా నైట్ బస్సులను నడుపుతున్నారు. ఈ మార్గాల్లో ప్రతి అరగంట నుంచి 45 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. సికింద్రాబాద్ చిలకలగూడ క్రాస్‌రోడ్డు నుంచి హయత్‌నగర్ వరకు మరో రెండు బస్సులు నడుస్తున్నాయి. అలాగే చిలకలగూడ నుంచి ఇబ్రహీంపట్నం వరకు నైట్ బస్సులను నడుపుతున్నారు. మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ నుంచి లింగంపల్లి నైట్ బస్సులు అందుబాటులో ఉన్నాయి.
ఈ నైట్ బస్సుల్లో అన్ని రకాల పాస్‌లను అనుమతించనున్నారు. 24 గంటల పాటు చెల్లుబాటయ్యే ట్రావెల్ యాజ్ యు లైక్ (టీఏవైఎల్) టిక్కెట్‌లపైనా ప్రయాణికులు నైట్ బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు.