రేపటి నుంచి విధుల్లో చేరతామని ఆర్టీసీ జెఎసి చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ అన్నారు. ఓ వైపు పోరాటం కొనసాగుతుంది అని ప్రకటిస్తూనే, మరోవైపు సమ్మె విరమించి విధుల్లో చేరతామని చెబుతున్నారు. తమ ఇష్టమొచ్చినప్పుడు విధులకు గైర్హాజరై, ఇష్టమొచ్చినప్పుడు మళ్లీ విధుల్లో చేరడం దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థలో కూడా ఉండదు. ఆర్టీసీ కార్మికులు తమంతట తామే విధులకు గైర్హాజరై, చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్నారు తప్ప, ఆర్టీసీ యాజమాన్యం గానీ, ప్రభుత్వం గానీ సమ్మె చేయమని చెప్పలేదు. బతుకమ్మ, దసరా, దీపావళి లాంటి అతి ముఖ్యమైన పండుగల సందర్భంగా అనాలోచిత సమ్మెకు దిగి ప్రజలకు తీవ్రమైన అసౌకర్యం కలిగించారు.
కార్మికులు ఇప్పుడు చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్నారు. ఇష్టమొచ్చినప్పుడు విధులకు గైర్హాజరయ్యి, మళ్లీ ఇష్టమొచ్చినప్పుడు విధుల్లో చేరడం నిబంధనల ప్రకారం సాధ్యం కాదు. గౌరవ హైకోర్టు చెప్పిన దాని ప్రకారం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె విషయంలో కార్మిక శాఖ కమిషనర్ తగు నిర్ణయం తీసుకుంటారు. దాని ప్రకారం ఆర్టీసీ యాజమాన్యం తదుపరి చర్యలు తీసుకుంటుంది. అంతా చట్ట ప్రకారం, పద్ధతి ప్రకారం జరుగుతుంది. అప్పటి వరకు అందరూ సంయమనం పాటించాల్సిన అవసరం ఉంటుంది.
హైకోర్టు చెప్పిన ప్రక్రియ ముగిసే వరకు చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్న కార్మికులను విధుల్లో చేర్చుకోవడం సాధ్యం కాదు. తమంతట తాముగా సమ్మెకు దిగి, ఇప్పుడు మళ్లీ విధుల్లో చేరడం చట్ట ప్రకారం కుదరదు. కార్మికులు ఇప్పటికే యూనియన్ల మాట విని నష్టపోయారు. ఇక ముందు కూడా యూనియన్ల మాట విని మరిన్ని నష్టాలు కోరి తెచ్చుకోవద్దు. రేపు డిపోల వద్దకు వెళ్లి శాంతి భద్రతల సమస్యలు సృష్టించవద్దని, బస్సులు నడుపుతున్న తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను అడ్డగించవద్దని కోరుతున్నాను.
అన్ని డిపోల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేసి, పరిస్థితిని సమీక్షించడం జరుగుతుంది. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే ప్రభుత్వంగానీ, ఆర్టీసీ యాజమాన్యం గానీ క్షమించదు. చట్ట పరమైన చర్యలు, క్రమ శిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇదే విషయాన్ని హైకోర్టుకు కూడా తెలియ చేయడం జరుగుతుంది. హైకోర్టు సూచించిన ప్రక్రియ ప్రకారం లేబర్ కమిషనర్ నిర్ణయం తీసుకునే వరకు సంయమనం పాటించాలని కోరుతున్నానని సునీల్ శర్మ తెలిపారు.
TSRTC MD Sunil Sharma Gives Shock To RTC Workers Over Rejoining..TSRTC MD Sunil Sharma Gives Shock To RTC Workers Over Rejoining..