ఎక్సైస్‌ టాక్స్ పొడిగింపుపై మంత్రికి వినతిపత్రం..

157
minster srinivas goud

రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్‌ను తెలంగాణ రెస్టారెంట్ & బార్ లైసెన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శాగంటి మనోహర్ గౌడ్ ఆధ్వర్యంలో వచ్చిన ప్రతినిధులు బృందం హైదరాబాద్‌లోని రవీంద్రభారతి కార్యాలయంలో కలిశారు. తెలంగాణ రెస్టారెంట్ & బార్ లైసెన్స్ దారులు లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా బార్ & రెస్టారెంట్ లను మూసివేసిన 15-03-2020 నుండి 25-09-2020 (194 రోజుల) కాల వ్యవధిలో చెల్లించిన ఎక్సైస్‌ టాక్స్ ను పొడిగించాలని వినతిపత్రాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా తెలంగాణ రెస్టారెంట్ & బార్ లైసెన్స్ దారులు లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా బార్ & రెస్టారెంట్ లను మూసివేసిన 194 రోజుల కాలాన్ని పొడిగించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు లాక్ డౌన్ సమయంలో ఎక్సైస్‌ టాక్స్, బార్& రెస్టారెంట్ల భవనాల అద్దె, ఉద్యోగుల జీతభత్యాలను చెల్లించి ఆర్థికంగా ఎంతో నష్టపోయామని మంత్రికి వివరించారు. కరోనా వల్ల ప్రస్తుతం రెస్టారెంట్&బార్ లకు కస్టమర్లు వచ్చే పరిస్థితి లేదని మంత్రికి తెలిపారు.

లాక్ డౌన్ సమయంలో తెలంగాణ రెస్టారెంట్ & బార్ లైసెన్స్ దారులు ఎంతోమంది వలస కూలీలకు, నిరుపేదలకు నిత్యావసర వస్తువులతో పాటు అన్నదాన శిబిరాలను ఏర్పాటు చేసి వేలాదిమందికి ఉచితంగా బోజనాలను అందించి తోడ్పాటు అందించా మని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కి వివరించారు. రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనల నుండి రెస్టారెంట్&బార్లకు మినహాయింపు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, పున: ప్రారంభానికి కృషిచేసిన మంత్రులు కేటీ రామారావు, శ్రీనివాస్ గౌడ్ గార్లకు తెలంగాణ రెస్టారెంట్ & బార్ లైసెన్స్ దారుల అసోసియేషన్ అధ్యక్ష కార్యవర్గ సభ్యులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రెస్టారెంట్ & బార్ లైసెన్స్ దారులు చేసిన విజ్ఞప్తిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. మీ సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శాగంటి పవన్ కుమార్ గౌడ్, సంతోష్ గౌడ్, కె.వెంకన్న, వినోద్, సారా వెంకటేష్, లింగారెడ్డి, సెర్బయ్య, శివ, అంజయ్య, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.