మొక్కలు నాటిన పోలీస్‌ హౌసింగ్ కార్పొరేషన్‌ చైర్మన్‌..

400
- Advertisement -

ఈరోజు సీఎం కేసీఆర్‌ 66వ పుట్టిన రోజు పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్,ఎండీ బి. మల్లారెడ్డి,ఐపీఎస్‌ చీఫ్‌ ఇంజనీర్‌ టి.విజయ్‌ కుమార్‌ తదితర అధికారులు, సిబ్బంది పెద్దఎత్తున అంబర్‌ పేటలోని పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ డివిజన్‌ కార్యాలయంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి మహమూద్‌ అలీ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా కోలేటి దామోదర్‌ మాట్లాడుతూ.. మన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా అభివృద్ధి చేయాలన్నదే మన ముఖ్యమంత్రి లక్ష్యమని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అన్నింటికన్నా ముఖ్యంగా పాడిపంటలు బాగుండాలని అప్పుడే రాష్ట్రం సభిక్షంగా ఉంటుందని అన్నారు. పంటలు బాగా పండాలంటే వర్షాలు బాగా కురవాలి. వర్షాలు కురవాలంటే చెట్లుండాలి. చెట్లు లేని ప్రాంతంలో వర్షాలు పడవు. ఆ ప్రాంతాలు ఎడారులగా మారిపోతాయన్నారు. ఈ భూమిపై గల సకల జీవులకు చెట్లే ప్రాణాధారం. చెట్లకు,నీటికి అవినాభావ సంబంధముంది. చెట్లుంటేనే వర్షాలు కురుస్తాయి. వర్షాలు పడితేనే చెట్లు పెరుగుతాయి. చెట్లు లేని చోట్ల వర్షాలు పడవు, వర్షాలు లేని చోట క్షామం తాండవిస్తుందని దామోదర్‌ అన్నారు.

TS PHC Chairman

మన రాష్ట్రం బంగారు తెలంగాణ కావాలంటే, రాష్ట్రమంతా సస్యశ్యామలమై వుండాలి. అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈ ఉద్ధేశ్యంతోనే సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రంలో హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారని అంటూ.. ఈ కార్యక్రమానికి మరింత బలం చేకూర్చే విధంగా రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్‌ గ్రీన్‌ ఛాలెంజ్‌ పథకాన్ని ప్రారంభించారని ఆయన అన్నారు. ఈ పథకం కింద ప్రతీ ఓక్కరూ మూడు మొక్కలు నాటి, మరొక ముగ్గురికి ఈ ఛాలెంజ్‌ను అందివ్వాలి.

ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన వారు కూడా తలా మూడు మొక్కలను నాటి ఒక్కొక్కరూ మరో ముగ్గురికి ఈ ఛాలెంజ్‌ను అందివ్వాలి. ఈ రకంగా కొంత కాలానికి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములవుతారు. ఈ పథకం బాగా విజయవంతమైంది. ఇప్పుడు ఇందులో రాష్ట్రంలోనే కాక యావత్ దేశంలోని ప్రముఖులంతా పాల్గొని గ్రీన్‌ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నారు. తిరిగి వారి మిత్రులకిస్తున్నారు. ఇందకుగాను మనమంతా ఎంపీ సంతోష్‌ కుమార్‌ని అభినందించాలని పోలీస్‌ హౌసింగ్ కార్పొరేషన్‌ చైర్మన్‌ అన్నారు.

TS PHC Chairman

సీఎం కేసీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని, పుష్పగుచ్చాలు,శాలువలు వంటి వృథా ఖర్చులకు పోకుండా,ప్రతి ఒక్కరూ చెట్లు నాటవలసిందిగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారని, ఇది చాలా పవిత్రమైన కార్యక్రమమని, సీఎం జన్మదినాన్ని పురస్కరించుని చెట్లు నాటడం మనకెంతో ఆనందదాయకమైన విషయమని మన రాష్ట్రనికి ప్రయోజనం చేకూర్చే కార్యక్రమమని ఆయన అన్నారు. ఈ ఆలోచనతోనే ఈరోజు పోలీస్ హౌసింగ్‌ కార్పొరేషన్ తరుపున ఈ పవిత్రమైన కార్యక్రమాన్ని చేపట్టామని కోలేటి దామోదర్ అన్నారు. చుట్టుపక్కల పాఠశాలల విద్యార్థులు కూడా ఇందులో ఎద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -