నిరుద్యోగులకు మరో శుభవార్తనందించింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే వేల సంఖ్యలో పోలీస్ ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా ఉపిన సర్కార్ తాజాగా పంచాయతీరాజ్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ వెలువరించనుంది.
పంచాయతీరాజ్ శాఖలో 6,603 జూనియర్ కార్యదర్శుల పోస్టుల భర్తీకి ఆర్ధిక శాఖ అనుమతించింది. దీంతో నోటిఫికేషన్ వెలువరించేందుకు మార్గం సుగమమైంది. ఇటీవలె మంత్రివర్గం 9,300 గ్రామ కార్యదర్శుల నియామకాలకు అమోదం కూడా తెలిపిన సంగతి తెలిసిందే.
గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల్లో బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. వీటితో పాటు మానాల రెసిడెన్షియల్ స్కూల్కు 22 పోస్టులు మంజూరు చేసింది. ప్రిన్సిపాల్ పోస్టు 1, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు 7, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు 9, ఫిజికల్ డైరెక్టర్ 1, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ 1, ఆర్ట్ క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ 1, సీనియర్ అసిస్టెంట్ 1, ఏఎన్ఎం 1 పోస్టులున్నాయి. జౌట్సోర్సింగ్లో జూనియర్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఆఫీస్ సబార్డినేటర్లు, వంటమనిషి, ఆయాల నియామకాలకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది.
ఇటీవలె తెలంగాణ ప్రభుత్వం పల్లెల్లో వెలుగులు నింపేందుకు కొత్తగా 4,383 పంచాయతీలను ఏర్పాటుచేసింది. దీంతో రాష్ట్రంలో గ్రామపంచాయతీల సంఖ్య 12,751కి పెరిగింది. తొలిదశలో కొత్తవాటితోపాటు పాత పంచాయతీల్లో కూడా కార్యదర్శుల ఖాళీలను భర్తీచేయడానికి ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది.