ప్రమాదరహిత ‘తెలంగాణ’ -మహేందర్ రెడ్డి

172
mahender reddy
- Advertisement -

రాష్ట్రంలో ప్రమాదాలను తగ్గించటంతో పాటు ఉద్యోగ, ఉపాధికి దోహదం చేసే విధంగా సుశిక్షితులైన డ్రైవర్లను తీర్చిదిద్దేందుకు సిరిసిల్లా తరహాలో అన్ని జిల్లాల్లో డ్రైవింగ్ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తామని రవాణా శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని నగర పరిసర చాంద్రాయన్ గుట్ట నియోజకవర్గం బండ్లగూడ రవాణా శాఖ కార్యాలయాన్ని మంత్రి మహేందర్ రెడ్డి గురువారం ఎంఎల్ఏ అక్బరుద్దిన్ ఓవైసీ, జేటీసీ పాండురంగ నాయక్, డీటీసీ పుప్పాల శ్రీనివాస్ తదితరులతో కలిసి తనిఖీ చేశారు.

డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ నిర్మాణం పనుల గురించి అధికారులతో సమిక్ష నిర్వహించారు. గతంలో హామీ ఇచ్చిన నేపథ్యం డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ స్థలం పరిశీలించి నిర్మాణం కోసం రూ 49.80 లక్షలు విడుదల చేసి వెంటనే పనులను ప్రారంభించాలని, రెండు నెలల్లో పనులు పూర్తి చేయాలని టీఎస్ఎంఐడీసీ సీఈ లక్ష్మారెడ్డి ని ఆదేశించారు. రాష్ట్రంలో వివిధ వాహనాలు నడిపే వారికి సరైన శిక్షణ, రోడ్డు భద్రత నిబంధనల మీద అవగాహాన లేక పోవటంతో ప్రమాదాలు చోటుచేసుకుని ప్రాణనష్టం పెరుగుతుందని చెప్పారు.

ప్రమాదాల నివారణ కోసం రాష్ట్రంలో సిరిసిల్లాలో రూ.18 కోట్లతో కేంద్రం సహాకారంతో నిర్మిస్తున్న డ్రైవింగ్ శిక్షణా కేంద్రం తరహాలో అన్ని జిల్లాలలో శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.ఇందుకు జిల్లాల వారిగా భూసేకరణ చేస్తామని, కనీసం రూ.5 కోట్లతో డ్రైవింగ్ ట్రాక్ లు సైతం నిర్మిస్తామని మంత్రి చెప్పారు. బండ్లగూడ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ నిర్మాణంతో పాత నగరంలో ప్రజల ఇబ్బందులు తీరుతాయన్నారు.బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయానికి దివంగత ఎంఐఎం వ్యవస్థాపకులు సుల్తాన్ సలావుద్దిన్ (సలార్) పేరు పెడుతామని అందుకు జీవో సైతం జారీ అయిందని మంత్రి వెల్లడించారు.

ప్రమాదరహిత తెలంగాణ సాధనకు రాష్ట్రంలో విద్యార్థులు,యువత, ప్రజా ప్రనినిధులు సాధారణ ప్రజలకు మరింత అవగాహాన పెంచాలని అందుకు రవాణా శాఖ అధికారులు కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు.అన్ని రవాణా శాఖ కార్యాలయాలు, ఆర్టీసీ స్థలాల్లో హరితహారం మొక్కలునాటాలని సూచించారు. ఎంఎల్ఏ అక్బరుద్దిన్ ఓవైసీ మాట్లాడుతూ బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయం, మిధాని డిపోల అధునీకరణతో పాత నగరంలో ప్రజలకు అటు ప్రజా రవాణా, ఇటు ఆర్టీఏ సేవలు సులభంగా అందుబాటులోకి వస్తాయని చెప్పారు. బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయానికి సలావుద్దిన్ ఓవైసి పెరుపెట్టడం పట్ల సీఎం కేసీఆర్, మంత్రి మహేందర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. పాత నగరంలో ప్రజలకు మరిన్ని ఆధునిక సేవలు అందేలా ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ఆర్టీఏ అధికారులు టీవీరావు, కార్పొరేటర్‌లు పాల్గొన్నారు.

- Advertisement -