భూసేకరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం….

283
TS Cabinet
- Advertisement -

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. సచివాలయంలోని సీ బ్లాక్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశం సుమారు మూడు గంటల పాటు కొనసాగింది. కేబినెట్ భేటీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటు పలు కీలక అంశాలపై చర్చించారు.

TS CABINET Metting

కొత్త భూసేకరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కొత్త భూసేకరణ బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దళిత, గిరిజన ఉప ప్రణాళిక పర్యవేక్షణ కోసం ఆర్థిక శాఖలో ప్రత్యేక విభాగం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. కృష్ణా ట్రైబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ కు వెళ్లాలని నిర్ణయించింది. రాష్ర్టంలో ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విధివిధానాల రూపకల్పనకు డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో ఉపసంఘం ఏర్పాటు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఉపసంఘంలో సభ్యులుగా మంత్రులు కేటీఆర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగదీష్ రెడ్డి, జోగు రామన్న, తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనసాగనున్నారు. కమిటీ సలహాదారుగా రాజీవ్ శర్మను నియమించాలని నిర్ణయించారు.

నగదు రహిత విధానాన్ని అమలు చేసే క్రమంలో టీఎస్ వ్యాలెట్ ను రూపొందించేందుకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రులు ఈటెల రాజేందర్, జగదీష్ రెడ్డి, మహేందర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కొనసాగనున్నారు.

TS CABINET Metting

తెలంగాణను నగదు రహిత రాష్ర్టంగా మార్చడానికి అన్ని రకాల కృషి చేయాలని కేబినెట్ లో నిర్ణయించారు. ప్రభుత్వం నుంచి జరిగే చెల్లింపులు, ప్రభుత్వానికి వచ్చే రాబడి సహా అన్ని ప్రభుత్వ లావాదేవీలు ఆన్ లైన్ లోనే జరిపేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఆర్టీసీలో కూడా స్వైపింగ్ మిషన్లు వినియోగించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. బస్సులో టికెట్లు ఆన్ లైన్ ద్వారానే ఇచ్చే విధంగా కృషి చేయాలని నిర్ణయించారు.

ప్రజలను నగదు రహిత లావాదేవీల వైపు నడిపించాలని సీఎం కేసీఆర్ మంత్రులకు సూచించారు. ప్రభుత్వ లావాదేవీలన్నీ నగదు రహితంగానే జరగాలన్నారు. సిద్ధిపేట, ఇబ్రహీంపూర్ లను నగదు రహిత లావాదేవీల గ్రామాలుగా మార్చామని తెలిపారు. సిద్ధిపేట విధానానికి దేశ వ్యాప్తంగా మంచి పేరు వస్తోందన్నారు. సిద్ధిపేటలో అమలవుతున్న విధానాన్ని ప్రధాని మోదీ కూడా ప్రశంసించారని చెప్పారు.

కొన్ని ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా నగదు రహిత విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. పని భారం లేని శాఖల నుంచి పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న శాఖలకు ఉద్యోగులను బదిలీ చేయడానికి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాజేంద్రనగర్ లోని వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పేరును పీవీ నర్సింహారావుగా మారుస్తూ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇకపై ఆర్డినెన్స్ ను చట్టంగా మార్చడానికి రెండు సందర్భాల్లో కేబినెట్ ఆమోదం అవసరం లేదని నిర్ణయించారు.

- Advertisement -